తరచుగా వెలుగుచూస్తోన్న స్మార్ట్ ఫోన్స్ పేలుడు ఘటనలు వినియోగదారులని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఒక ఘటన మరిచిపోక ముందే మరొక ఘటన చోటుచేసుకుంటున్న వైనం వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గతంలో విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, ఇటీవలే ముంబైలోని ఓ రెస్టారెంట్లో స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లోనూ ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో శంషాబాద్‌కి చెందిన చిట్టిబాబు అనే యువకుడు రెడ్మీ 4ఏ పేలుడు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు.
ఇటీవలే రెడ్మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేసిన చిట్టిబాబుకు ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కూరగాయల మార్కెట్‌కి వెళ్లిన చిట్టిబాబుకు ఫోన్ కాల్ రావడంతో జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అందులోంచి పొగలు వస్తుండటం గమనించి వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చిట్టిబాబు అలా ఫోన్ కిందికి విసిరేసిన మరుక్షణమే ఆ మొబైల్ పేలిపోయింది. చిట్టిబాబు ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ ఫోన్ అతడి చేతిలో పేలి ఉండేదని తెలుస్తోంది. తన కళ్లెదురుగా జరిగిన ఘటనను చూసి హడలిపోయిన చిట్టిబాబు వెంటనే ఫోన్ పేలిన విషయాన్ని తెలుపుతూ సదరు సెల్‌ఫోన్ కంపెనీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.