పలు మార్పులుచేర్పుల అనంతరం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అధికారిక వెబ్సైట్ సరికొత్త హంగులతో రైలు ప్రయాణికుల ముందుకొచ్చింది. సరికొత్త వెబ్‌సైట్‌తో ఇకపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు కలగడంతోపాటు ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్ వ్యవస్థను మరింత పటిష్టపరిచే విధంగా ఉంటుంది అని ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ సైతం ఓ ట్వీట్ చేశారు.
భారతీయ రైల్వే చెప్పిన వివరాల ప్రకారం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన అదనపు సౌకర్యాలు, మార్పులు ఇలా వున్నాయి.
> ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్స్ ఇలా వుండనున్నాయి.
> చిక్కుముడులు లేకుండా ఆహ్లాదకరమైన పద్ధతిలో టికెట్ బుకింగ్ సౌకర్యం.
> మొబైల్స్, డెస్క్‌టాప్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ వంటి పరికరాలన్నింటిపైనా మరింత సులభతరంగా వినియోగించడానికి వీలుగా వెబ్సైట్ డిజైన్.
> గతంలో మాదిరిగా రైళ్లు, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను తెలుసుకోవడానికి వెబ్సైట్లో నమోదు చేసుకుని లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
> రైళ్లు బయల్దేరు సమయం, చేరుకునే సమయం, క్లాస్, రైలు, కోటా వివరాలను అనుసరించి ఫిల్టర్స్ ద్వారా సెర్చ్ చేసుకునే వెసులుబాటు.
> సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (CRIS) అభివృద్ధి చేసిన పరిజ్ఞానంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్స్ కన్ఫర్మేషన్ సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునేందుకు వెసులుబాటు.
> బుకింగ్ ట్రెండ్స్‌కి అనుగుణంగా వెయిట్ లిస్ట్ సీట్ల వివరాలు తెలుసుకునేందుకు ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ వీలు కల్పిస్తుంది.
> టికెట్ రద్దు చేయడం, ప్రింట్ తీసుకోవడం, ఎస్ఎంఎస్ రిక్వెస్ట్, వికల్ప్ ఆప్షన్ ద్వారా మరో ప్రత్యామ్నాయ రైలుని ఎన్నుకునే వీలు ఉండటం వంటి బహుళ సేవలను సులభంగా పొందడానికి వీలుగా ఈ ఐఆర్సీటీసీ వెబ్సైట్ రూపకల్పన.
> టికెట్స్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు అందరికీ తమ తమ వివరాలు పొందుపర్చేందుకు వీలుగా వేర్వేరు కార్డులు అందుబాటులో వుంటాయి. ముందస్తుగా పొందుపర్చిన వివరాల ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం మరింత సులభతరం కానుంది.
> మై ప్రొఫైల్ సెక్షన్లో ఆరు బ్యాంక్ ఎకౌంట్స్‌ని జత చేసుకుని, ఆయా ఎకౌంట్స్ ద్వారా చెల్లింపులు జరిపే సౌకర్యం.