న్యూఢిల్లీ: 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్' కింద తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఏప్రిల్ 1న పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అలాగే తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్త బంద్, రహదారుల దిగ్బంధనం చేపట్టాలని నిర్ణయించాయి.
ఆదివారం ఉదయం తమ నేతలు దిల్లీలో సమావేశమై, పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వస్తారని 'దళిత ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య' సలహాదారు అశోక్ భారతి శనివారం వెల్లడించారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరుతూ- భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. దళిత సంఘాల పోరాటానికి కమ్యునిస్టు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
గత నెలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఫిర్యాదు నమోదు చేసుకున్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే..! ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులపై డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి చేత ముందుగా ప్రాథమిక దర్యాప్తు చేయించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన అనుమతి మేరకే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత నియామక విభాగం అనుమతి పొందిన తర్వాతనే అరెస్టులు చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. 'ఒక పౌరుడి కులమతాలేవైనా అతణ్ని వేధించడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం. ఆ హక్కుకు ఈ కోర్టు రక్షణ ఇస్తుంది. చట్టం వల్ల కుల విద్వేషాలు రాకూడదు’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
దేశవ్యాప్త బంద్‌కు దళిత సంఘాల పిలుపు