ఒక శాస్త్రవేత్తగా... ఒక అధ్యాపకుడిగా.. అంతకు మించి ఒక రాష్ట్రపతిగా భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన అభినవ రథసారధి.. నవభారత నిర్మాత.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్.. ఆయన 86వ జయంతిని పురస్కరించుకొని అతని జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మీకోసం..
- అబ్దుల్ కలామ్ వివాహం చేసుకోలేదు. జీవితాంతం శాస్త్రవికాసం కోసం, ఒక నవభారతాన్ని నిర్మించడం కోసమే తాపత్రయపడేవారు. అందుకే తనకు వచ్చే జీతంలో చాలా భాగం ట్రస్టులకు ఇచ్చేసేవారు. రాష్ట్రపతి అయ్యాక తన మొత్తం వేతనాన్ని కూడా ట్రస్టుకి ఇచ్చేశారు. "ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత.. తనకు జీవితాంతం ప్రభుత్వమే అన్ని జీవన సదుపాయాలు కల్పిస్తుంది. అలాంటప్పుడు నాకు వేతనమెందుకు...? దానిని ఏదైనా మంచి పనికి ఉపయోగించాలనే నేను భావిస్తున్నాను" అని చెప్పేవారు కలామ్.
- తిరువసంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు తనకు బాగా పరిచయస్తుడైన చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసేవారు కలామ్. ఎప్పుడైనా తన చెప్పులు గానీ, బూట్లు గానీ పాడైనప్పుడు.. తను ఎక్కడున్నా... ఎంత దూరంలో ఉన్నా.. ఆ వ్యక్తిని కలిసి అతనితోనే వాటిని కుట్టించుకొనేవారు. అతను చెప్పులు కుడుతున్నంత సేపు, అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకొనేవారు.
- స్కూలులో చదువుతున్నప్పుడు అబ్దుల్ కలామ్, తన తండ్రికి సహాయం చేయడం కోసం ఉదయానే లేచి ఇంటింటికి వెళ్లి వార్తాపత్రికలు అందించేవారు.
- కలామ్ది చాలా నిరాడంబరమైన జీవితం. అతను టీవీ పెద్దగా చూసేవారు కాదు. అతని అల్మరాలో కొన్ని పుస్తకాలు, వీణ, రెండు జతల బట్టలు, ఒక మినీ సీడీ ప్లేయర్, చిన్న ల్యాప్ టాప్ మాత్రమే ఉండేవి.
- కలామ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంటు భవనానికి సౌరశక్తితో వచ్చే విద్యుత్‌నే వాడాలని భావించారు. అయితే అతని ప్రపోజల్ అతను పదవిలో ఉండగా ఆచరణలోకి రాలేదు.
- కలామ్ రాష్ట్రపతిగా ఉండగా, బాలలు రాష్ట్రపతి భవనాన్ని సందర్శించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలా దరఖాస్తు చేసుకున్న బాలలను ఆయన స్వయంగా కలిసి ముచ్చటించారు కూడా.
- ఓసారి కలామ్ ఓ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు, తనకు సెక్యూరిటీగా వస్తున్న వాహనంలోని ఓ పోలీసు చాలా సేపు నిలబడే ఉండడం చూసి బాధపడ్డారు ఆయన. అతన్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
- తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు.
- శాస్త్ర సాంకేతిక రంగాలలో కలామ్ చాలా చురుకైన పాత్ర పోషించారు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు.