కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు అరుణ్ జైట్లీ ఆదివారం బీజేపీ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. పార్టీ, ఈశాన్య రాష్ట్రాల్లో తన ఉనికిని విస్తరించేందుకు క్రమ పద్ధతిలో పనిచేసుకుంటూ ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు. "త్రిపురలో, గత అసెంబ్లీ ఎన్నికలలో ఈశాన్య రాష్ట్రాల్లో మాకు మద్దతు తక్కువగా ఉండేది. కానీ.. ఇప్పుడా పరిస్థితులు లేవు. బీజేపీ కలిసికట్టుగా ప్రతి రాష్ట్రంలో పనిచేసి మద్దతును, ప్రాముఖ్యతను సంపాదించుకుంది" అని జైట్లీ చెప్పారు.
రాష్ట్రంలో నేడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. "త్రిపుర ప్రజలు సంపూర్ణ రాష్ట్ర హోదాను పొందినప్పటినుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్య సాంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అందుకే రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఐ (ఎం)కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి" అన్నారాయన. బీజేపీ, సీపీఐ (ఎం) ఫిబ్రవరి 18న జరగబోయే త్రిపుర ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడుతాయి.