భారత్‌కి వెళ్లాలనుకునే యాత్రికులు జాగ్రత్త వహించాల్సిందిగా అమెరికా ఆ దేశ పౌరులకి హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ పర్యటనకు దూరంగా ఉండాల్సిన అవసరం వుందని అమెరికా ప్రభుత్వం ఈ తాజా ప్రకటనలో స్పష్టంచేసింది. జమ్మూకాశ్మీర్‌లోని లడక్ మినహా మిగతా ప్రాంతాల్లో పర్యటించే సందర్భాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని అమెరికా సూచించింది. అమెరికా పౌరులు, యాత్రికుల రక్షణార్ధం వారికి ఎప్పటికప్పుడు మెరుగైన సమాచారం అందించే ప్రయత్నంలో భాగంగానే అమెరికా బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లోని 10 కి.మీ మేర విస్తరించి వున్న ప్రాంతాల్లో పర్యటన ముప్పుతో కూడుకున్నదని పేర్కొన్న అమెరికా.. భారత్‌లో పేరుగుతున్న నేరాలు, తీవ్రవాదదాడుల్నే అందుకు కారణంగా చూపించింది.
భారత్‌లో అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమయ్యాయని భారత ప్రభుత్వ వర్గాల నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అమెరికా స్పష్టంచేసింది. భారత్‌లోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో చురుగ్గా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నక్సలైట్ కార్యకలాపాలని కూడా అమెరికా సర్కారు ఈ హెచ్చరికల్లో పేర్కొంది.
భారత్‌కి వెళ్లే వాళ్లు జాగ్రత్త : అమెరికా