సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాజాగా ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఫేస్ బుక్ లో సైన్అప్ కావాలంటే మీరు తప్పనిసరిగా ఆధార్ లో ఉన్నట్లే పేరు నమోదు చేయాలి. దానినే మీరు మీ ప్రొఫైల్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. అందుకే ఇది కొందరికి మాత్రమే కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అందరికీ కనిపిస్తుందని ఫేస్ బుక్ వర్గాలు తెలిపాయి.
సాధారణంగా ఫేస్ బుక్ అకౌంట్ తెరవాలంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అవసరం. వాటితో అకౌంట్ ఓపెన్ చేసేసి ప్రొఫైల్ నేమ్ ను మారుస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. దీనిని ఆసరాగా చేసుకొని చెడు మార్గాలకు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ యూజర్లు తమ మిత్రులను, శ్రేయోభిలాషులు సులువుగా గుర్తుపట్టేందుకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
అయితే ఫేస్ బుక్ సైన్అప్ కు ఆధార్ ప్రకారం పేరు నమోదు చేయడం తప్పనిసరి కాదని.. అప్షనల్ మాత్రమే అని చెప్పారు. సైన్అప్ లో మీ ఆధార్ నెంబర్ అడగరని.. కేవలం పేరు మాత్రమే అడుగుతారని వివరణ ఇచ్చారు.