ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న 'కరోనా వైరస్'.. మరోవైపు ఎన్నెన్నో సిత్రాలకు కారణమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రముఖులు విరాళాలు సేకరిస్తున్నారు. పేద వారికి ఆహార, పానీయాలు అందిస్తున్నారు.
కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు రకరకాలుగా అవగాహనలు కల్పిస్తున్నారు. ఇప్పటికే సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ పేరిట ప్రముఖులు చాలా మంది అవగాహన కల్పించారు. ఇప్పుడు సరికొత్త ఛాలెంజ్ మన ముందుకు వచ్చింది. ఈ ఛాలెంజ్ ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రారంభించాడు.
'కరోనా వైరస్' పాజిటివ్ గా వచ్చిన వారికి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ముందు వరుసలో ఉండి సేవలు చేస్తున్నారు. దీని కోసం వారు ఇళ్లూ, వాకిళ్లు త్యాగం చేసి డ్యూటీకే పరిమితమయ్యారు. ఇప్పటికీ వారు సేవ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు వారు సేవలు చేయాల్సి వస్తుందో కూడా స్పష్టత లేదు. ఈ సమయంలో అందరూ వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే సరికొత్త ఛాలెంజ్ ప్రారంభమైంది.
ఇందుకోసం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ .. ముందుకొచ్చాడు. తన తల షేవింగ్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతే కాదు టైమ్ ల్యాప్స్ లో తీసిన ఈ వీడియోను పోస్ట్ చేసిన అతడు.. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు ఛాలెంజ్ విసిరాడు. కోవిడ్ 19 కోసం సేవ చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి మద్దతుగా నిలిచేందుకు ఈ వీడియో చేసినట్లు వెల్లడించాడు.
మరోవైపు ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం 4 వేల 460 మంది పాజిటివ్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..