ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'గా థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ట్రైలర్‌తో ఎట్రాక్ట్ చేసిన ఈ డిటెక్టివ్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది ఈ రివ్యూలోకి వెళ్లిచూద్దాం.

Last Updated : Jun 21, 2019, 10:05 PM IST
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ, త‌దిత‌రులు
సంగీతం : మార్క్ కె.రాబిన్‌
ఛాయాగ్రహణం: స‌న్నీ కూర‌పాటి
నిర్మాణం : స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాత‌ : రాహుల్ యాద‌వ్ న‌క్కా
రచన దర్శకత్వం : స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె
విడుదల తేది : 21 జూన్ 2019

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'గా థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ట్రైలర్‌తో ఎట్రాక్ట్ చేసిన ఈ డిటెక్టివ్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది ఈ రివ్యూలోకి వెళ్లిచూద్దాం.

కథ :
నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరుతో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నడుపుతుంటాడు ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్‌ పొలిశెట్టి). పెద్దగా కేసులు లేక పోలీసులకు చిన్న చిన్న కేసుల్లో సాయం చేస్తుంటాడు. ఒక పెద్ద కేసు కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన ఫ్రెండ్‌ క్రైమ్‌ రిపోర్టర్‌ శిరీష్‌ భారీగా లభ్యమవుతున్న అనాథ శవాల గురించి చెప్తాడు. తన టాలెంట్ ఏంటో రుజువుచేసుకోవాలని చూసే సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆ కేసును టేకప్ చేయాలనుకుంటాడు. ఆ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకొని తన అసిస్టెంట్ స్నేహ (శృతి శ‌ర్మ)తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆత్రేయ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ మర్డర్ కేసులో ఆత్రేయనే అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు పోలీసులు.

జైలులో ఉండగా తన కూతురిని ఘోరంగా మానభంగం చేసి, హత్య చేశారని మారుతీ రావు అనే వ్యక్తి ఆత్రేయకు చెపుతాడు. తన కూతురికి చనిపోయే ముందు ఫోన్‌ చేసిన ముగ్గురి ఫోన్‌ నంబర్లు ఇస్తాడు. బెయిల్‌పై రిలీజ్‌ అయిన ఆత్రేయ ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తాడు. ఆ మూడు నంబర్లలో ఆత్రేయకి ఓ ఇద్దరి వివరాలు మాత్రమే లభిస్తాయి. ఆ వివరాలతో వారిని ఫాలో అవుతాడు. అలా ఆత్రేయ ఇన్వెస్టిగేట్‌ చేస్తుండగానే ఆ ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. ఆ హత్య కేసుల్లో కూడా ఆత్రేయనే అనుమానించి ముద్దాయిగా భావిస్తారు పోలీసులు.

ఆ కేసులో మరోసారి ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. అతి కష్టం మీద మళ్ళీ బెయిల్‌పై బయటకు వచ్చిన ఆత్రేయ ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు ? ఆ అసలు ఆ హత్యలు చేసింది ఎవరు ? వాటన్నిటినీ డిటెక్టివ్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎలా ఛేదించాడన్నదే మిగతా కథ.

నటీనటుల పనితీరు :
యూ ట్యూబ్‌లో హిందీ వీడియోల ద్వారా పాపులర్ అయిన నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ తన కామెడీ టైమింగ్, ఎమోషన్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. శృతి శ‌ర్మ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. డిటెక్టివ్ ఆత్రేయ అసిస్టెంట్‌గా మంచి నటన కనబరిచింది. కథను మలుపుతిప్పే పాత్రలో క్రిశ్నేశ్వరావు బాగా నటించాడు. వసుధ పాత్రలో శ్రద్దా రాజ్ గోపాల్ పరవాలేదు అనిపించుకుంది. ఆత్రేయకి సహాయం చేసే పోలిస్ పాత్రలో రామ్ దత్ , ఎస్.ఐగా విశ్వనాధ్ , ఆత్రేయ స్నేహితుడిగా ప్రశాంత్ అలాగే సందీప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సుహాస్ కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేసాడు. మిగతా నటీనటులంతా పరవాలేదనిపించుకున్నారు.
 
సాంకేతిక వర్గం పనితీరు :
మార్క్ కె.రాబిన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. షెర్లాక్ హోమ్స్ పాట పరవాలేదు. స‌న్నీ కూర‌పాటి కెమెరా వర్క్ ప్లస్ అయ్యింది. ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలకు సౌండింగ్ బాగా కుదిరింది. స్వరూప్ కథ-కథనం ఆకట్టుకున్నాయి. స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

తెలుగులో డిటెక్టివ్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ సినిమా మీద హైప్ రావడానికి అదే ముఖ్య కారణం. ఆ హైప్‌తో విడుదలైన ఈ సినిమా ఆసక్తికరమైన కథ- కథనంతో ఆకట్టుకుంటుంది. సినిమాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ రివిల్ చేయకుండా ట్రైలర్‌తో ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు సినిమా కథాంశంతో మెస్మరైజ్ చేసాడు. సినిమాను కామెడీగా స్టార్ట్ చేసి తర్వాత కాస్త ఆసక్తికరంగా నడిపించి చివరికి మెప్పించాడు దర్శకుడు.

తను చెప్పాలనుకున్న పాయింట్‌కి ఎంటర్టైన్‌మెంట్ యాడ్ చేసి డిటెక్టివ్ సినిమాగా మలిచిన తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు స్వరూప్. తొలి సినిమాకే మంచి మంచి కథ, ఆసక్తికరమైన కథనం రాసుకున్నాడు. మొదటి భాగంలో ఓ మర్డర్ మిస్టరీని హైలైట్ చేస్తూ కథను ముందుకు నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌కి వచ్చే సరికి ఎవరూ ఊహించని విధంగా సినిమాను ముగించాడు.

శవాలను మాయం చేసి వాటితో వ్యాపారం చేసే ఓ ముఠా, ఆ ముఠాను పట్టుకోవడం కోసం హీరో చేసే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేస్తాయి. ఇక కథకి పర్ఫెక్ట్ అనిపించే హీరోని ఎంచుకొని ఆత్రేయ క్యారెక్టర్‌తో ఎంటర్టైన్ చేసాడు స్వరూప్. కాకపోతే రెండో భాగంలో హీరో క్యారెక్టర్‌తో పాటు క్రైంని కూడా హైలైట్ చేసే విషయంలో తడబడ్డాడని అనిపిస్తుంది. అందువల్లే సినిమా కాస్త డ్రాగ్ అనిపిస్తూ కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. సినిమాలో నెగిటీవ్ క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా స్వరూప్ విఫలమయ్యాడు. క్లైమాక్స్ కూడా ఊహించిన రీతిలో లేదు. ఏదో సదా సీదాగానే ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. రెండో భాగంలో వచ్చే క్రైం సన్నివేశాలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. ఆ సీక్వెన్సెస్ సినిమాకే హైలైట్. ఆ సన్నివేశాలకు నేపథ్య సంగీతం, సౌండింగ్ బాగా కుదిరాయి.
నవీన్ పొలిశెట్టి నటన , కథ -కథానం , నేపథ్య సంగీతం , రెండో భాగంలో వచ్చే క్రైం సన్నివేశాలు , కామెడీ , ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ కాగా ఎడిటింగ్ , రెండో భాగంలో సాగదీసినట్టుగా అనిపించే సన్నివేశాలు, క్లైమాక్స్ సినిమాకు మైనస్.

ఓవరాల్‌గా డిటెక్టివ్ సినిమాగా వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఊహించని కథనంతో ఆకట్టుకుంది.

రేటింగ్ : 3 /5

జీ సినిమాలు సౌజన్యంతో

 

Trending News