దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఏపీ సర్కార్ కు సేవలందించిన స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది.ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేంద్ర హోంశాఖ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా నియమించినట్లు తెలిసింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చీఫ్ సెక్యూరిటీ అధికారి బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని టాక్.
తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం స్టీఫెన్ ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్.. ఆయన్ను డిప్యుటేషన్ మీద తమ రాష్ట్రానికి పంపించాలని కేంద్ర హోంశాఖకు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన హోం శాఖ ..ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ ఆయన పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే రవీంద్ర ఏపీకి బదిలీ కావాలంటే .. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో కేంద్రానికి లేఖ రాయాలి. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి.. ఏపీ క్యాడర్ కు వెళ్తారు. దీనికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది.
ఫ్యాక్షన్ ఆపరేషన్స్ లో దిట్ట...
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన స్టీఫెన్ రవీంద్ర..ఆయన కుమారుడైన జగన్ కొలువులోకి రానుండటం గమనార్హం. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు సక్సెస్ ఫుల్ నిర్వహించారు స్టీఫెన్ రవీంద్ర. చాలా నిక్కచ్చిగా పనిచేసే అధికారిగా మంచి పేరున్న స్టీఫెన్ రవీంద్రకు ఏపీలో పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్నే జగన్ ఏరి కోరి తెచ్చుకుంటున్నారట.