ఉడుపి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కృష్ణ మందిరం. ఇది ప్రపంచంలోనే ప్రముఖ కృష్ణ మందిరంగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు బాల కృష్ణుడి రూపంలో వెలిశాడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఈ దేవాలయం ఉడుపి రథవీధిలో కలదు. ఉడిపి కృష్ణ మందిరాన్ని ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు సందర్శిస్తారు. నవరంధ్రాలున్న కిటికీ ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత. ఇది మంగళూరు కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉత్తర ద్వారం ద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడిపక్క దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళితే సరోవరం(కోనేరు) కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమపక్క ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం ఉంటుంది. పీఠాధిఫతులకు తప్ప లోనికి మరెవరినీ అనుమతించరు.
చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు హనుమంతుడు, ఎడమవైపు గరుడ దేవుడు కనిపిస్తారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణమార్గం వైపు ప్రదక్షిణం చేసినట్లైతే ఎడమవైపు మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. పీఠాధిపతి ఇక్కడే ఆశీర్వచనాలు ఇస్తారు.
సమీపంలో చూడవలసిన ఇతర ముఖ్య పర్యాటక ప్రదేశాలు :-
మల్పె బీచ్, సెయింట్ ఐలాండ్, కౌప్, మరవంతే, కనంగి ఆలయం
ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ నుంచి ఉడిపి 787 కి.మీ. దూరంలో ఉంది. రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. విమానంలో వెళ్లాలనుకునేవారు మంగుళూరు వెళ్లి అక్కడి నుంచి ఉడిపి చేరుకోవచ్చు.