కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. రైతులు, పేద, మధ్య తరగతి జనాలను ప్రధాన టార్గెట్ గా చేసుకొని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీకి సంబంధించిన మేని ఫోస్టో విడుదల చేశారు.
హోదాకు తొలి ప్రాధాన్యం...
కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపర్చారు. విభజనతో నష్టపోయిన ఏపీకి బేషరుతగా హోదా ఇస్తామని ప్రకటించారు. కాగా అవినీతి నిర్మూలనకు పెద్దపీట వేయడం గమనార్హం. జీఎస్టీ పన్నులతో జనాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సరళతరమైన జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు
ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టో - రాహుల్
ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు వివరించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం...
మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
* న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి రూ.72 వేలు చొప్పున పేదల అకౌంట్లో జమా
* ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టుల భర్తీకి శ్రీకారం
* పంచాయతీల్లో ఉద్యోగాలు భర్తీ చేసి గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం
* గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150కి పెంపు
* రైతు సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
* రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత
* విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ జీడీపీలోని 6 శాతం నిధులు కేటాయింపు
* జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన
* రక్షణ శాఖకు సంబంధించిన రఫేల్ ఒప్పందంపై సమగ్ర విచారణ
* బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై సమగ్ర విచారణ
* వ్యవసాయ అభివృద్ధి, ప్రణాళికలకు శాశ్వత జాతీయ కమిషన్ ఏర్పాటు.
* రాజకీయ ప్రమేయం లేని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు.
* సరళతరమైన జీఎస్టీ విధానాన్ని అమలు
హాజరైన సీనియర్ నేతలు వీరే
ఢిల్లీలో జరగిన కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు
Delhi: Congress party releases their election manifesto for #LokSabhaElections2019 pic.twitter.com/fccNKOuSqZ
— ANI (@ANI) April 2, 2019