నటీనటులు : సుమంత్ , ఇషారెబ్బ, తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆర్.కె. ప్రతాప్
సంగీతం : శేఖర్‌చంద్ర
మూలకథ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
రచనా సహకారం : నాగమురళీధర్ నామాల
నిర్మాత : బీరం సుధాకర్‌రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.
విడుదల : 7 డిసెంబర్ 2018
ప్రస్తుతం స్టోరీ బేస్డ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న సుమంత్ “సుబ్రహ్మణ్యపురం” సినిమాతో ఈరోజే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుబ్రహ్మణ్యపురం అనే ఊరు… ఆ ఊరిలో జరిగే సంఘటన నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందా… ఈ సినిమాతో సుమంత్ మరో హిట్టు అందుకున్నాడా… అనే వివరాలు తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలోనే మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను, ఆమె మంచితనాన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై పరిశోధన మొదలుపెడతాడు. అలా పరిశోధన మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురంలో ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథాంశం.
నటీనటుల పనితీరు :
థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కార్తీక్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు సుమంత్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, గుడిపై పరిశోధన సన్నివేశాల్లో సుమంత్ బాగా నటించాడు. ఈషా రెబ్బ తన పెర్ఫార్మెన్స్‌తో పరవాలేదనిపించుకుంది. సురేష్ , సాయి కుమార్, గిరి తమకు వున్న అనుభవంతో, పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యారు. జోష్ రవి, భద్రం కామెడీ పండలేదు. టి.ఎన్.ఆర్ అలాగే మిగతా నటీ నటులు తమ క్యారెక్టర్స్‌తో పరవాలేదనిపించుకున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరు :
థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న శేఖర్ చంద్ర తన మ్యూజిక్‌తో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఈరోజిలా, ఫ్రెండ్షిప్ సాంగ్స్ పరవాలేదనిపించగా ‘సాహో షణ్ముఖ’ సాంగ్ ఆకట్టుకుంది. ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం, బాలు గానం కలిసొచ్చాయి. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ పరవాలేదు. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి స్పీడ్ పెంచితే బాగుండేదనిపించింది. లక్ష్మి సింధుజ ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట శ్రీనివాస బొగ్గరం అందించిన మూల కథ రొటీన్ అనిపించినా.. సంతోష్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. నాగ మురళీధర్, సంతోష్ డైలాగ్స్ అలరించాయి. ముఖ్యంగా ‘మేమంతా ఆ భగవంతుణ్ణి సెర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావ్’, గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను.. నువ్వా భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావ్” డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.
Also read : సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ : దేవుడి మహిమా ? లేక మానవ మేధస్సా ? అసలు సుబ్రహ్మణ్యపురంలో ఏముంది ?
‘దేవుడి మహిమా…లేక మానవ మేదస్సా’.. ఇదే సుబ్రహమణ్యపురం మెయిన్ ప్లాట్… ఈ పాయింట్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. విజయాలు సాధించాయి. మరి ఈ కథతో డెబ్యూ డైరెక్టర్ ఎంత వరకూ ఎంగేజ్ చేయగలడు..? ట్రైలర్ చూసాక ప్రేక్షకుల ఒపీనియన్ ఇది. అయితే నిజానికి వెంకట శ్రీనివాస్ బొగ్గరం అందించిన మూల కథలో కొత్తదనం లేదు కానీ తన స్క్రీన్ ప్లేతో దర్శకుడు కొంత వరకు మేజిక్ చేయగలిగాడు. గతంలో ఈ జానర్‌లో చేసిన షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో సినిమాను బాగానే డీల్ చేసాడు. ముఖ్యంగా విలన్ ఎవరై ఉంటారా అనే క్యూరియాసిటిని ప్రేక్షకుడిలో క్రియేట్ చేయగలిగాడు. థ్రిల్లర్ సినిమాలకు ఇదే బలం కూడా. ప్రేక్షకుడి మేదస్సుకి కాస్త పదును పెడుతూ కథను ఎంగేజింగ్‌గా చెప్పగలగాలి. అయితే ఈ విషయంలో దర్శకుడిగా యాబై మార్కులు మాత్రమే అందుకున్నాడు సంతోష్.
సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుడిలో ఆసక్తి రేకెత్తించడంలో సక్సెస్ అయిన దర్శకుడు కథను ఇంకాస్త ఎంగేజింగ్‌గా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ నవ్వించకపోగా బోర్ కొట్టించాయి. హీరోగా మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్న సుమంత్‌కి థ్రిల్లర్ జానర్ కొత్తే అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు.
ఫస్ట్ హాఫ్ ఏదో అలా..అలా నడిపించేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ మాత్రం తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో నెరేషన్‌తో సినిమాను నడిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం స్పీడ్‌గా సుత్తి లేకుండా కథను ముందుకు నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ఆయువు పట్టులా నిలిచింది. సుమంత్ పెర్ఫార్మెన్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలైట్స్ కాగా ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్, కామెడి, కొన్ని బోర్ కొట్టించే సీన్స్, సినిమాకు మైనస్ పాయింట్స్.
ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘సుబ్రహ్మణ్యపురం’ నచ్చితీరుతుంది.
రేటింగ్: 2 .75 / 5
జీ సినిమాలు సౌజన్యంతో...