KTR Letter to CM Revanth Reddy: ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్‌కి కేటీఆర్ రాసిన లేఖ యధాతధంగా..
"తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, అమలు చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటున్నా మీరు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉచిత ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలను మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. స్వయంగా మీతో సహా ప్రస్తుతం మీ క్యాబినెట్లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క కోమటిరెడ్డి వంటి నేతల మాటలను మీకు మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వారు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అందిస్తామంటూ ప్రజలకు పదేపదే హామీలు ఇచ్చారు. మీరు కూడా ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వం మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీం కూడా తీసుకొస్తుందేమో అని మాట్లాడిన మీరు, ఈరోజు ఎల్ఆర్ఎస్ ను ప్రజలపైన పెను భారం వేసేలా అమలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు.
గత ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు “ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోపిడీ చేయడంమే, అయినా ప్రభుత్వాలకు ప్రజలు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసిన భూములపైన రెగ్యులరైజేషన్ పేరుతో వాటాలు ఎందుకు తీసుకుంటుంది” అన్నారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీల రూపంలో ఎందుకు దోపిడీ చేస్తుందో మీరు చెప్పాలి. “ఎల్ఆర్ఎస్ వద్దు అంటే ప్రజలంతా, నో ఎల్ఆర్ఎస్- నో బిఆర్ఎస్ అనాలి, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టేలా ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడారు. “ఎల్ ఆర్ ఎస్ రూపంలో ప్రభుత్వం ప్రజల రక్త మాంసాలను పీలుస్తుంది” అని సీతక్క అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అంటూ కోర్టుకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టుకు సైతం వెళ్లారు. ఇలా ప్రజలను మభ్య పెట్టేలా, బహిరంగంగా మాట్లాడిన మీ క్యాబినెట్ సహచరులను అడిగిన తర్వాతనే ఈ ఎల్ఆర్ఎస్ పైన చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారా అనేది ప్రజలకు మీరు వివరిస్తే బాగుంటుంది.
Also Read: Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?
ప్రజా పాలన, ప్రజా సంక్షేమం, గ్యారంటీల అమలు, హామీలు అమలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న మీరు, మీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పైన 20వేల కోట్ల రూపాయల మేర ఎల్ఆర్ఎస్ చార్జీల భారం వేయడం మీ ద్వంద నీతికి, పరిపాలనలో, హామీల అమలులో మీ డోల్లతనానికి అద్ధంపడుతుంది. రాష్ట్రంలో ఉన్న 25.44 లక్షల కుటుంబాల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారం వేస్తున్న మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏ విధంగా అవుతుందో చెప్పాలి. ప్రజల నుంచి 20వేల కోట్ల రూపాయల డబ్బులను గుంజుకుంటున్న మీ ప్రభుత్వం దయలేని ప్రభుత్వం అవుతుంది కానీ.. ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది.
ఒకవేళ మీ విధానం ప్రజల వద్ద నుంచి ఎల్ ఆర్ ఎస్ చార్జీలు వసూలు చేయడమే అయితే మరి గతంలో మీ ప్రచారం సందర్భంగా చెప్పిన తప్పుడు మాటలకి, తప్పుడు హామీలకు ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే మీ ప్రభుత్వం గ్యారెంటీల అమలు అంటూ ఊదరగొడుతూనే… మరోవైపు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేక పరిమితులు, నియంత్రణ చేస్తున్న విషయం సైతం ప్రజలకు అర్థమవుతున్నది. ఎల్ఆర్ఎస్ విషయంలోనూ మీ ద్వంద వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అందుకే మీరు ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రజల తరఫున నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు కలెక్టర్లు, ఆర్డిఓల ద్వారా ప్రజలు కోరుకుంటున్న ఉచిత రెగ్యులరైజేషన్ డిమాండ్ ను మీ దృష్టికి తీసుకువచ్చాము. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, మీరు అసెంబ్లీలో చెప్పిన మాట అవగింజంత వాస్తవమే అయితే వెంటనే ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలి. రాష్ట్ర ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజుల రూపంలో తీసుకోకుండా వారి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." అని మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
Also Read: KN Rajannna: జై పాకిస్థాన్ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter