Murder Case Accused Shot Dead in Bus In Front Of Cops : జైపూర్ : ఇది ఒక సినీఫక్కీలో జరిగిన మర్డర్ కేసు. 2022 లో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని పోలీసులు కోర్టు విచారణ కోసం ఆర్టీసీ బస్సులో కోర్టుకు తీసుకువెళుతుండగా.. మార్గం మధ్యలోనే ఆర్టీసీ బస్సును అడ్డగించిన గుర్తుతెలియని సాయుధులైన దుండగులు పోలీసుల కళ్ల ముందే నిందితుడిపై కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో వారు ఏ నిందితుడిని అయితే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారో.. ఆ నిందితుడు చనిపోగా.. అతడితో పాటే కోర్టు విచారణకు వెళ్తున్న మరొక నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రాజస్థాన్లోని భరత్పూర్లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. భరత్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భరత్పూర్లోని అమోలి టోల్ ప్లాజా సమీపంలో రాజస్థాన్ ఆర్టీసీ బస్సుపై దాదాపు డజను మంది వ్యక్తులు దాడి చేశారు. కోర్టు విచారణ కోసం పోలీసులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తున్న మర్డర్ కేసు నిందితుడిని కాల్చి చంపారు. అదే సమయంలో మరొక హత్య కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తికి కూడా తూవ్ర గాయాలయ్యాయి. తొలుత గాయపడిన ఇద్దరు నిందితులను పోలీసులు హూటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ ఇద్దరిలో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన మరొక నిందితుడికి అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు ఇద్దరు నిందితులను తీసుకుని కోర్టుకు బయల్దేరగా.. వారు ప్రయాణిస్తున్న రాజస్థాన్ ఆర్టీసీ బస్సు అమోలి టోల్ ప్లాజా సమీపంలోకి చేరుకునేటప్పటికీ అకస్మాత్తుగా ఒక కారు, రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు బస్సుని అడ్డగించి బస్సులోకి చొరబడ్డారు. లోపల ఉన్న పోలీసు సిబ్బందిపై కారం పొడి చల్లి వారిని చూడలేకుండా చేశారు. ఆ తరువాత పోలీసులు తీసుకెళ్తున్న నిందితులు కుల్దీప్ జఘీనా, విజయపాల్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కుల్దీప్ జఘీనా మరణించగా.. విజయపాల్ పరిస్థితి విషమంగా ఉంది" అని భరత్ పూర్ సీనియర్ పోలీసు ఆఫీసర్ ఒకరు ప్రముఖ వార్తా సంస్థ పిటిఐకి వెల్లడించారు.
స్థానిక రాజకీయ నాయకుడు కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనాను గతేడాదే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా జైలులోనే ఉంటూ కోర్టు విచారణకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే కుల్దీప్ జఘీనాను గుర్తు తెలియని దుండగులు ఇలా సడెన్ ఎటాక్ చేసి మట్టుపెట్టారు. బస్సుపై దాడి జరిగిందని తెలుసుకున్న జిల్లా పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.