భారతీయ బ్యాట్స్‌మన్, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ ఆటగాడి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానాన్ని పొందాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేయడం.. ఆయనకు బాగా కలిసొచ్చింది. ఆయన తిరిగి టెస్టుల్లో నెంబర్ వన్ కావడానికి ఆ పరుగులే దోహదపడ్డాయి. లార్డ్స్ టెస్టులో భారత్ విఫలమవ్వడంతో అప్పుడు కోహ్లీ ర్యాంకింగ్ కూడా పడిపోయింది. రెండవ స్థానానికే ఆయన పరిమితమయ్యారు.
అయితే మళ్లీ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ర్యాంకింగ్స్ ప్రకారం 937 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే కోహ్లీ రేటింగ్ కూడా ఆసారి బాగా మెరుగుపడింది. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో కూడా ప్రస్తుతం కోహ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
టీమ్ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతండగా.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆ తర్వాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్, న్యూజిలాండ్ తర్వాతి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్, ఆస్ట్రేలియా తర్వాతి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జేమ్స్ ఆండర్సన్ 899 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడా (882 పాయింట్లు) రెండవ స్థానంలోనూ, భారతీయ ఆటగాడు రవీంద్ర జడేజా (840 పాయింట్లు) మూడవ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారతీయ బౌలర్ బుమ్రా మొదటి స్థానంలో నిలవగా, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ రెండవ స్థానంలో, పాకిస్తాన్ ఆటగాడు హసన్ అలీ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.
టెస్టు ర్యాంకుల్లో మళ్లీ కోహ్లీ నెం.1