Boss Vs Employee Whatsapp War: ఉద్యోగం చేసే చోట సరైన జీతం లేకపోయినా సర్దుకుపోయి పని చేస్తారేమో కానీ సరైన గౌరవం లేకపోతే మాత్రం ఎవ్వరూ పని చేయలేరు. కొన్ని కొన్ని కంపెనీల్లో బాసులు ఉద్యోగులను హ్యాండిల్ చేసే తీరు చాలా ఘోరంగా ఉంటుంది. ఉద్యోగులతో కంపెనీ కోసం ఎలా పని చేయించుకుంటే వారి నుంచి సత్ఫలితాలు రాబట్టవచ్చు అనే విషయాన్ని పక్కనపెట్టి.. వారిపై తమ అజమాయిషీని ప్రదర్శిస్తుంటారు. తానే హోల్ అండ్ సోల్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ప్రవర్తనే కొన్నిసార్లు వారిని ఉద్యోగుల చేత తిట్టించుకునేలా చేస్తుంది.
ఒకప్పుడైతే ఇలాంటి వ్యవహారాలు ఉద్యోగులకు, వారి బాస్‌కి మధ్య మాత్రమే ఉండేటివి.. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. ఎప్పుడైతే జనం సోషల్ మీడియాను విరివిగా వినియోగించడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి ఇలాంటి వ్యవహారాలు నాలుగు గోడల మధ్య ఉండటం లేదు. బాస్ మీద తమకు వచ్చిన ఫ్రస్టేషన్‌ని నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని బాస్ మీద ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అక్కడ తోటి మిత్రులు, ఇతర నెటిజెన్స్ ఇచ్చే నాలుగు పాజిటివ్ మాటలతో సాంత్వన పొందుతూ తమకు జరిగిన అవమానాన్ని మర్చిపోతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ చేసిన బాస్.. అందులో ఇలా పేర్కొన్నాడు.
" రేపు ఉదయం జస్టిన్ ఆఫీసుకు రావడం లేదు. రేపు ఉదయం 7 గంటల షిఫ్టులో అతడి స్థానంలో 6.16 గంటలకు వచ్చి ప్రిపేర్ అవ్వు " అని రాసి ఉంది.
ఆ మెసేజ్‌కి ఇవతలి ఉద్యోగి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
ఇంతలోనే బాస్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. " నువ్వు మెసేజ్ చదివినట్టుగా వాట్సాప్‌లో రీడ్ " అని పడింది కనుక రేపు ఉదయాన్నే వచ్చేసెయ్ అని మరోసారి ఆర్డర్ పాస్ చేశాడు.
మొదటిసారి వచ్చిన మెసేజ్‌కే ఇంకా ఎటూ ఆలోచించుకోలేకపోయిన సదరు ఉద్యోగికి.. రెండోసారి వచ్చిన మెసేజ్ చూశాకా మరింత ఒళ్లు మండింది.
వెంటనే ఆ ఉద్యోగి స్పందిస్తూ.. " తనకు రావడం కుదరదని.. ప్రత్యామ్నాయంగా బ్రియాన్‌ని అడిగారా " అని ఇవతలి వైపు నుంచి రిప్లై ఇచ్చాడు.
ఈసారి ఉద్యోగి అడిగిన ప్రశ్నకు బాస్ స్పందిస్తూ.. బ్రియాన్‌కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని.. రేపు ఉదయాన్నే రమ్మని చెప్పి ఇంత తక్కువ వ్యవధిలో అతడిని పిలవలేను అని బాస్ బదులిచ్చాడు. అంతటితో ఊరుకోని బాస్.. " నువ్వు ఎలాగూ ఒంటరివే కదా అందుకే నిన్ను పిలుస్తున్నాను.. రావడానికి నీకేం సమస్య " అని ఒకింత అమర్యాదగానే నిలదీశాడు.
బాస్ అడిగిన తీరు చూశాకా ఉద్యోగికి ఫ్యూజులు ఔట్ అయ్యాయి.
బాస్ మీద కోపం తన్నుకొస్తున్నప్పటికీ.. తన కోపాన్ని అణుచుకుంటూనే.. మధ్యాహ్నం అయితే రాగలను కానీ ఉదయాన్నే తనకు పని ఉన్నందున రాలేను అని చెప్పుకొచ్చాడు.
ఈసారి కూడా బాస్ తీరులో ఏమీ మారకపోగా.. ఉద్యోగిపై మరింత అసహనాన్ని వెళ్లగక్కాడు. " ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని సమాధానం ఇవ్వు " అంటూ ఉద్యోగిపై వాట్సాప్‌లోనే రంకెలేసినంత పనిచేశాడు. " నీకు రాలేనంత పెద్ద పని ఏం ఉంది " అని గుచ్చి గుచ్చి అడిగాడు.
బాస్ అలా రెచ్చిపోతున్నప్పటికీ ఉద్యోగి ఓపిక పడుతూనే వస్తున్నాడు. " తన మిత్రుడు ఇల్లు మారుతున్నాడని.. అతడికి సహాయం చేసేందుకు వెళాల్సి ఉంది " అని చెప్పుకొచ్చాడు.
ఈసారి కూడా బాస్ మళ్లీ ఏం తగ్గలేదు. " అతడికి సహాయం చేసేందుకు నువ్వే దొరికావా.. ఇంకొకరిని అరేంజ్ చేయ్.. లేదంటే రేపు నీ డ్యూటీ అయ్యే వరకు నీ ఫ్రెండుని ఆగమని చెప్పు " అని యధావిధిగానే ఆర్డర్ పాస్ చేశాడు.
ఇదంతా చూశాకా ఉద్యోగిలో ఫ్రస్టేషన్ బరస్ట్ అయింది.
తాను ఆఫీసుకు సోమవారం వస్తానని.. ఇప్పుడే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని స్పష్టంచేశాడు. ఇప్పటి నుంచి మరో 15 రోజులు నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తాను.. అది కూడా నువ్వు నన్ను ఉద్యోగంలోంచి తీసెయ్యకపోతేనే అని ఖరాఖండిగా చెప్పేశాడు. అప్పటివరకు బాస్‌తో మాట్లాడుతున్నాను అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు చేసిన చాట్‌లో ఆ భావన, భయం ఏ మాత్రం లేవు. ఇక తాను ఫ్రీ బర్డ్ అనే స్వేచ్చనే ఎక్కువగా కనిపించింది.
ఆ తరువాత తనకు, తన బాస్‌కి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ఉద్యోగి.. తనకు, తన బాసుకి మధ్య జరిగిన మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్టుగా నెటిజెన్స్‌కి చెప్పుకొచ్చాడు. ఆ ఉద్యోగి పరిస్థితి చూసి జాలిపడిన నెటిజెన్స్.. అతడి బాస్ అహంకారంపై ఆగ్రహం వెళ్లగక్కారు.