Jofra Archer ruled out of rest of the IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో సరైన బౌలింగ్ లేక తంటాలు పడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ముంబై స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 16 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆర్చర్ ఇప్పటికీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో.. తన స్వదేశమైన ఇంగ్లండ్ పయనమయ్యాడు. అతడి స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ ట్విటర్ ద్వారా పేర్కొంది. రూ. 2 కోట్ల కనీస ధరకు జోర్డన్‌తో ముంబై ప్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.
గాయంతో సతమతం అవుతూ ఐపీఎల్ 2023లో జోఫ్రా ఆర్చర్ సరిగ్గా రాణించలేకపోయాడు. ఆర్చర్‌ను తమ పర్యవేక్షణలో ఉంచాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈబీసీ) నిర్ణయించింది. ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఆర్చర్‌ను కాపాడుకునేందుకు ఈబీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 16 సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 9.50 ఏకానమితో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆర్చర్ బౌలింగ్ పట్ల ముంబై ప్రాంచైజీ కూడా అసంతృప్తిగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేని లోటుని అతడు తీరుస్తాడని భావించినా.. అలా జరగలేదు.
'దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2023లోని మిగిలిన మ్యాచ్‌లకు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. ఆర్చర్ స్థానాన్ని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు' అని ముంబై ఇండియన్స్ తన ట్విటర్‌లో తెలిపింది. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన క్రిస్ జోర్డాన్.. పలు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తంగా 28 మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్.. 9.32 ఎకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరఫున 87 టీ20లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు.
మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ ఆడతాడో లేదో చూడాలి. ఒక వేళ జోర్డాన్ ఆడితే ముంబై బౌలింగ్ మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ ఆరంభంలో బెంగళూరు, ముంబై జట్లు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ మినహా ముంబై బ్యాటర్లు అందరూ ఫామ్‌లో ఉన్నారు. పైగా నేడు వాంఖడేలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 విజయాలు, 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నేడు రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. కీలక మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు పోరాడనున్నాయి. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, రమణదీప్ సింగ్, డెవాల్డ్ బ్రీవిస్, రాఘవ్ గోయల్, విష్ణు వినోద్, రిలే మెరెడిత్, షామ్స్ ములానీ, అర్జున్ టెండూల్కర్, తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, డువాన్ జాన్సెన్, సందీప్ వారియర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.
Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.