ఏటా కోట్లకు కోట్లు సిగరెట్లు తాగిపడేస్తున్నారని ఓ స్వచ్చంద సంస్థ చెప్పిన లెక్క. అలా తాగి ఎక్కడికక్కడ పడేయడం వల్ల ప్రకృతికి హాని కలుగుతోందని, వీటిని రీసైక్లింగ్ చేయాలని ఇద్దరు స్నేహితులు రూబెన్ వాన్ డెర్, బాబ్ స్పైక్‌మన్ ఆలోచించారు. వారిద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందుకే 'కాకి' ని ఈ ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్నారు. కాకులను మచ్చిక చేసుకొని సిగరెట్ ముక్కల్ని ఏరేస్తున్నారు.
వారిద్దరూ ఆమ్‌స్టర్‌డామ్ పార్కును పరిశుభ్రం చేయాలని అనుకున్నారు. సరే అని వెళ్లి చూస్తే .. ఇంకేం అక్కడ తట్టెడు సిగరెట్ పీకలు దొరికాయి. ఇక్కడే ఇంత ఉంటే మరోచోట పరిస్థితి ఏంటీ? అని ఆలోచించారు. దానికి వారు చేసిన ప్రయత్నమూ లేదూ .. కరపత్రాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. మనమెలాగో చేయలేం గానీ రోబోతో ప్రయత్నిద్దాం అని అనుకున్నారు. కానీ అది ఎక్కడ ట్రాఫిక్ లో మొరాయిస్తుందో అని భయపడ్డారు.
మరో ప్రత్యామ్నాయం ఏమిటా అని ఆలోచిస్తుండగా.. వెంటనే అక్కడ వారికి కావ్ కావ్ మంటూ ఆహారాన్ని నోట్లో పట్టుకొనిపోతున్న కాకి కనిపించింది. అదీగాక వీరు ప్రకృతి ప్రియులు. పక్షులను యిట్టె మచ్చిక చేసుకుంటారు. ఇవైతే సందుగొందుల్లో ఉన్న సిగరెట్ ముక్కల్ని కూడా ఏరిపారేస్తుంది అని అలోచించి ఆచరణలో పెట్టారు. పీకలు తెచ్చిచ్చినందుకు బదులుగా వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు వారు క్రోబాక్స్ అనే పెట్టెను ఏర్పాటుచేశారు. ఆ పెట్టెను సిగరెట్ పీకలు తెచ్చి అందులో వేస్తే ఆహారం బయటకు పడేలా ఏర్పాటుచేశారు. భలేగా ఉంది కదూ ..! ఈ పెట్టె.
కానీ అలా మూగజీవులు పనిచేప్పే బదులు మనమే సిగరెట్ ముక్కల్ని నేలపై పారవేయకుండా డస్ట్ బిన్ లో వేస్తే సరిపోదూ.. !
'కాకి' పనులకు 'ఔరా' అనాల్సిందే !