న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి బిల్లుగా గుర్తింపు పొందిన త్రిపుల్ తలాక్ బిల్లు ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల మధ్యే లోక్ సభ ఆమోదం పొందింది. గురువారం సాయంత్రం సభలో జరిగిన ఓటింగ్లో మెజార్టీ సభ్యుల నుంచి బిల్లుకు ఆమోదం లభించింది. అప్పటికప్పుడు త్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని నిరోధించడంతోపాటు త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే ముస్లిం పురుషులకు జైలు శిక్ష విధించడమే ఈ బిల్లు లక్ష్యం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం పార్టీలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాయి. కేంద్రం ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశోధనకు పంపించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
లోక్ సభలో ఆమోదం పొందిన త్రిపుల్ తలాక్ బిల్లు ఇక పెద్దల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ చట్టం అమలులోకి వస్తే ఇకపై ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ వేధింపుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఎన్డిఏ సర్కార్ భావిస్తోంది.