హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై విచారణ.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

దిశ అత్యాచారం, హత్య తరువాత జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

Last Updated : Dec 12, 2019, 04:20 PM IST
హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై విచారణ.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య తరువాత జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిటీకి సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ నేతృత్వం వహించనుండగా బాంబే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రేఖ, సీబీఐ మాజీ చీఫ్ బి కార్తికేయన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కేసుపై నిన్న విచారించిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌కు రిటైర్డ్ జడ్జిని నేతృత్వం వహించాలని నిర్దేశించింది. విశ్రాంత న్యాయమూర్తి ఢిల్లీలోనే ఉండి.. సిట్‌కు నేతృత్వం వహిస్తారని తెలిపింది. దీని కోసం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీవీ రెడ్డిని నేతృత్వం వహించాలని ధర్మాసనం కోరింది. ఐతే ఆయన నిరాకరించడంతో కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ విచారణ చేసిన సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే.. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. అంతేకాదు విచారణను ఆరు నెలల్లోగా ధర్మాసనానికి సమర్పించాలని ఆదేశించారు. 

ఈ కేసులో తెలంగాణ పోలీసులు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా ఈ కేసును విచారణ చేస్తున్నాయని ఆయన సుప్రీం కోర్టుకు తెలిపారు. ఐతే తెలంగాణ పోలీసులను తాము తప్పు పట్టడం లేదని సీజేఐ అన్నారు. ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర్య విచారణ జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. అంతేకాదు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తెలంగాణ పోలీసులను క్రిమినల్ కోర్టులో హాజరుపరిచినా తమకేం అభ్యంతరం లేదన్నారు. కానీ వారు అమాయకులు అని చెబితే మాత్రం.. ప్రజలకు నిజానిజాలు తెలిసి తీరాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.  అందుకే త్రిసభ్య కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. దీనికి అభ్యంతరమేంటని తెలంగాణ పోలీసుల తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

Trending News