ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతులకు ఓ సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని రైతులు చెరకు పండించవద్దని ఆ సలహా. బుధవారం భాగ్పాట్ లో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన ప్రసంగించారు.
ఆ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ..' మీరు చెరకు కాకుండా ఇతర పంటలను పండించాలి. అధికంగా చెరకు పండించడం వల్ల చక్కెర ఉత్పత్తి అధికమమై తద్వారా వినియోగం కూడా పెరుగుతుంది. ఇది షుగర్ వ్యాధికి (మధుమేహం) కారణమవుతుంది' అని సలహా ఇచ్చారు. కూరగాయలు పండించడం ఉత్తమమని, ఢిల్లీలో కూరగాయలకు ఎంతో గిరాకీ ఉందని ఆయన చెప్పారు.
ఢిల్లీ- సహరన్పూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ పై విషయం చెప్పారు. చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల గురించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 26 వేల కోట్ల రూపాయిల బకాయిలు చెల్లించామని, మరొక 10 వేల కోట్ల రూపాయిలను సుగర్ మిల్స్‌కు త్వరలోనే చెల్లిస్తామని అన్నారు.