'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో అన్ని రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 దఫాలుగా 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన అంశాలను ప్రకటించారు.
ఐతే, 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ఒక డొల్ల అని.. కేంద్రం మసిబూసి మారేడుకాయ చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అంతే కాదు ఈ ఉద్దీపన ప్యాకేజీ వల్ల ప్రజలు, వ్యాపారులు, వలస కూలీలు, వాణిజ్యవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలు ఒరిగేది లేదని విమర్శించాయి. ఐతే విపక్షాల విమర్శలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. వారు ఎలాంటి మాటలైనా మాట్లాడనివ్వండి.. దేశ ప్రజలను, నిరుపేదలను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్దీపన ప్యాకేజీ మంచి సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు.
లాక్ డౌన్ విధించగానే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశ పెట్టామని చెప్పుకొచ్చారు. అంతే కాదు కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కునేందుకు రాష్ట్రాలకు కొంత నగదు కూడా మంజూరు చేశామని తెలిపారు. అది సరిపోదని తెలిసినప్పటికీ .. అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఐతే ఇలా నగదు బదిలీ చేయడం కంటే వాణిజ్య రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు తీసకుంటే ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతుందని భావించినట్లు ఆమె వివరించారు.
ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తుండగానే.. కాంగ్రెస్ సహా కొన్ని విపక్షాలు దీన్ని ఓ డ్రామా అని.. టీవీ సీరియల్ అంటూ కామెంట్స్ చేయడం తన దృష్టికి వచ్చిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఓ వైపు వలస కూలీలు రోడ్లపై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తుంటే.. కాంగ్రెస్ నాయకులు గప్ చుప్ తింటూ ఇంట్లో కూర్చోలేదా అని ఆమె విమర్శించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తిగా కింది వీడియోలో చూడండి..
#WATCH: Finance Minister Nirmala Sitharaman speaks to ANI Editor Smita Prakash. https://t.co/NqEaIstcmU
— ANI (@ANI) May 20, 2020
.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..