రూ.500లకే.. 1 బిలియన్ ఆధార్ నెంబర్లు

ఆధార్ ఇంట్రాసైట్‌ యూజర్‌నేమ్, పాస్‌వర్డులను బయటవారికి స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు ఆ సంస్థలో పనిచేసే కొందరు ప్రబుద్ధులు. 

Last Updated : Jan 4, 2018, 02:16 PM IST
రూ.500లకే.. 1 బిలియన్ ఆధార్ నెంబర్లు

పేటీఎం ద్వారా జస్ట్ రూ.500 చెల్లిస్తే చాలు. దాదాపు 1 బిలియన్ ఆధార్ నెంబర్లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అందుకు సంబంధించి ఆధార్ ఇంట్రాసైట్‌ యూజర్‌నేమ్, పాస్‌వర్డులను బయటవారికి స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు ఆ సంస్థలో పనిచేసే కొందరు ప్రబుద్ధులు. ఇటీవలే ఓ రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది.

వాట్సప్ ద్వారా కొందరు ఆధార్ కార్డులు ప్రింట్ చేసే ఏజెంట్లు ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారిచ్చే యూజర్ నేమ్, పాస్ వర్డులను పోర్టల్‌లో ఎంటర్ చేసి దాదాపు ఏ వ్యక్తికి సంబంధించిన ఆధార్ నెంబరునైనా, పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, ఈమెయిల్‌తో సహా తస్కరించవచ్చు. అలాగే మరో రూ.300 చెల్లిస్తే ఏ పౌరుడి ఆధార్ కార్డునైనా ప్రింట్ అవుట్ తీసే సాఫ్ట్‌వేరు డౌన్లోడింగ్ పద్ధతిని కూడా బహిర్గతం చేస్తున్నారు వీరు.

ఈ క్రమంలో పౌరుల సమాచార భద్రతకు సంబంధించిన విషయం అని.. ప్రభుత్వం ఇందుకు కారకులైనవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి పలు ప్రజా సంఘాలు. పౌరులకు సంబంధించిన ఆధార్‌లో వివరాలు బయటకు వెళ్లకుండా కాపాడే వ్యవస్థ ఉందని గతంలో ప్రభుత్వం ప్రకటించినా.. పరిస్థితులు చూస్తుంటే ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ ఆవశ్యకం అని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు పొందేవారు ఆధార్ అనుసంధానం చేయాలని.. అందుకు గడువుతేదీ మార్చి 31 వరకు ఉందని తెలిపిన విషయం తెలిసిందే.

Trending News