సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. యావత్ భారతావని జరుపుకొనే విశిష్టమైన పండుగ. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, తమిళనాడు ప్రాంతాల్లో కూడా సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వీటి ఏ ఏ రాష్ట్రాల్లో సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారో మనం కూడా తెలుసుకుందాం..!
గుజరాత్: గుజరాత్ ప్రాంతంలో సంక్రాంతి నాడు నువ్వులతో చేసిన మిఠాయిలు పంచిపెడతారు. అలాగే ఇంటి పెద్దలు, ఇంట్లో చిన్నవాళ్లకు బహుమతులు సంక్రాంతి సందర్భంగా కానుకలిచ్చే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అలాగే సంక్రాంతి సందర్భంగా గుజరాత్లో గాలిపటాల పోటీలు నిర్వహించడం కూడా ఆనవాయితీ వస్తోంది.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో తీల్గుల్ పేరిట నువ్వులతో చేసిన హల్వా చేసి బంధుమిత్రులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కొత్తగా పెళ్లైన మగువలకు పసుపు, కుంకుమలతో పాటు, తాంబూలాలు అందించి వస్తువులను కూడా బహుకరిస్తారు. ఈ సంప్రదాయాన్ని "హల్దీ కుంకుమ్" అంటారు.
పంజాబ్: పంజాబ్లో సంక్రాంతి రోజున గోపాల వ్రతం కూడా చేస్తారు. అలాగే సంక్రాంతికి ముందు "లోహ్రీ" అనే ప్రత్యేక ఉత్సవాన్ని చేస్తారు. మనకి భోగి పండుగ ఎలాంటి ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందో, పంజాబ్లో లోహ్రీకి అంతే ప్రాధాన్యం ఉంది. ఆ రోజు ఆరుబయట మంటలు వేసి ఇష్టదైవాలను ఆరాధిస్తారు. అలాగే మకర సంక్రాంతిని పంజాబ్లో "మాఘీ" అంటారు.
ఉత్తర్ ప్రదేశ్: యూపీలో సంక్రాంతిని "కిచెరి" అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు వివిధ ప్రాంతాల నుండి యూపీకి వచ్చి ప్రయాగలో స్నానమాచరిస్తారు.
ఒరిస్సా: ఒరిస్సాలో కూడా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతిని జరుపుకుంటారు. రంగోళీలు వేసి, దైవపూజలు చేస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నం వండి పేదలకు పంచిపెడతారు.
తమిళనాడు: తమిళనాడులో సంక్రాంతిని 'పొంగల్' పేరుతో నాలుగు రోజులు జరుపుకుంటారు. భోగి రోజున కొత్త బియ్యంతో పాయసం చేసి, పిత్రాది దేవతలకు నైవేద్యం పెడతారు. మరుసటి రోజు జరిగే సూర్య పొంగల్ (మనకు మకర సంక్రాంతి) రోజున పశువులను ఆరాధిస్తారు. సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందేలు నిర్వహించడం తమిళనాడులో సంప్రదాయం.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ''సుకరాత్'' పేరుతో జరుపుకుంటారు. గోవులను పూజిస్తూ.. కొత్త పంటలను ఇంటికి తీసుకొని వస్తారు.
కేరళ: కేరళలో 'మకర విళక్కు' పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు శబరిమలైలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దూరప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తుంటారు.