న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం దేశంలో సంచలనం సృష్టించింది. ఆర్బీఐని గాడిన పెట్టలేని పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన కారణంగానే ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలావుంటే, గవర్నర్ ఉర్జిత్ పటేల్తోపాటే డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సైతం తన పదవికి రాజీనామా చేశారనే పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఉర్జిత్ పటేల్ రాజీనామా అంశమే తీవ్ర చర్చనియాంశమైన ప్రస్తుత నేపథ్యంలో మరో డిప్యూటీ గవర్నర్ కూడా రాజీనామా చేశారనే వార్తలు మరింత సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం ఉర్జిత్ పటేల్, విరల్ ఆచార్య ఇద్దరూ తప్పుకునేంత దారుణమైన పరిస్థితి నెలకొని వుందా అనే చర్చలు జరిగాయి. దీంతో విరల్ ఆచార్య రాజీనామా చేసినట్టుగా వస్తున్న వార్తలపై ఆర్బీఐ స్పందించింది. డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య రాజీనామా వదంతులను ఖండించిన ఆర్బీఐ అధికార ప్రతినిథి.. అందులో వాస్తవం లేదని స్పష్టంచేశారు.