Rajiv Gandhi Assassination Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన పెరారివాలన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్‌కు 30 ఏళ్ల తర్వాత బెయిల్ లభించడం గమనార్హం. రాజీవ్ హత్య కేసులో ఇదే తొలి బెయిల్. జైలులో అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోవడం.. ఇప్పటికే 30 ఏళ్ల శిక్షను అనుభవించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ పెరారివాలన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం (మార్చి 9) విచారణ చేపట్టింది.
బెయిల్‌పై విడుదలయ్యాక ప్రతీ నెలా పెరారివాలన్ స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేకాదు, పోలీసుల అనుమతి లేనిదే అతని స్వగ్రామం జోలార్‌పెటాయ్‌ని వీడొద్దని సూచించింది. పెరారివాలన్ బెయిల్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. పెరారివాలన్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నాడని.. ఇప్పటికీ మూడుసార్లు పెరోల్ పొందాడని తెలిపింది.
పెరారివాలన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపించారు. రాజీవ్ హత్య కేసులో పెరారివాలన్‌కు మరణశిక్ష పడగా.. 2014లో అది యావజ్జీవ శిక్షకు కుదించబడిందని గుర్తుచేశారు. శిక్ష విషయంలో ఇప్పటికే ఒకసారి బెనిఫిట్ పొందిన పెరారివాలన్‌కు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు.
రాజీవ్ గాంధీ హత్య జరిగిన సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. రాజీవ్ హత్యకు ఉపయోగించిన బెల్టు బాంబుల్లోని 9 వోల్ట్ బ్యాటరీలను పెరారివాలన్ సప్లై చేశాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు మొత్తం 29 మందిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. వీరిలో 19 మందిని నిర్దోషులుగా, ఏడుగురిని దోషులుగా 1999లో సుప్రీం కోర్టు తేల్చింది. దోషులుగా తేలినవారిలో నళిని, మురుగన్, శాంతన్, పెరారివాలన్‌లకు మరణశిక్ష విధించగా మిగతావారికి యావజ్జీవ శిక్ష పడింది. 2014లో నళిని, మురుగన్, శాంతన్, పెరారివాలన్‌లకు విధించిన శిక్ష కూడా యావజ్జీవ శిక్షకు కుదించబడింది.
Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!
ALso Read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook