కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీకి ఏకంగా ఐ లవ్ యూ చెప్పారు. 'ఐ లవ్ నరేంద్ర మోదీ' అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ మోడీ పట్ల తనకు ఏమాత్రం ద్వేషం లేదన్న అర్ధం చెప్పే క్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూణెలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మోదీపై తనకు ప్రేమ ఉందని, ద్వేషం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చారు
బీజేపీకి రాహుల్ చురకలు..
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సైనిక దాడులను కూడా బేజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడుల గొప్పదనం మన వైమానిక దళానిదని... కానీ ఇక్కడి రాజకీయ నేతలు ఇది తమ ఘనతలా చెప్పుకుంటారని ఆరోపించారు. ప్రధాని మోడీ తన ప్రచార సభల్లో అనేక సార్లు సైనిక దాడి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలె యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ భారత సేనను 'మోడీసేన'గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బీజేపీ నేతలకు ఈ మేరకు చురకలు అంటించారు