గుజరాత్‌కి, రాహుల్‌కి మధ్య ఓ "జెండా" కథ..!

   

Last Updated : Nov 24, 2017, 08:56 PM IST
    • అతిపెద్ద జాతీయ జెండాని తయారుచేసిన దళిత వాలంటీర్లు
    • కార్యాలయంలో స్థలం లేదని తిరస్కరించిన గుజరాత్ ప్రభుత్వం
    • గుజరాత్ పర్యటనలో భాగంగా జెండా స్వీకరించనున్న రాహుల్
గుజరాత్‌కి, రాహుల్‌కి మధ్య ఓ "జెండా" కథ..!

గుజరాత్ రాష్ట్రాన్ని తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సందర్శించనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ అనుకోని అదృష్టం వరించింది. గుజరాత్‌లోని సనంద్ ప్రాంతానికి చెందిన దళిత శక్తి కేంద్రం వాలంటీర్లు తయారుచేసిన అతిపెద్ద జాతీయ జెండాని ఆయన ఈ పర్యటనలో భాగంగా స్వీకరించనున్నారు. దాదాపు 125 అడుగులు పొడవు, 83 అడుగుల ఎత్తు ఉన్న ఈ జాతీయ జెండాని తయారు చేసిన దళిత విద్యార్థులు మాట్లాడుతూ భారతదేశంలో అంటరానితనాన్ని అరికట్టాలనే ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్మే తాము, ఆ సందేశాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యాన్ని చేపట్టామని తెలిపారు. తొలుత వాలంటీర్లు ఆ జెండాని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి బహుమతిగా ఇవ్వాలని భావించారట. అందుకోసం రాజధాని గాంధీ నగర్ కలక్టరేటు అధికారులను కలవగా.. కార్యాలయంలో ఆ జెండాని ఉంచేంత స్థలం లేదని చెప్పి వాలంటీర్ల అభ్యర్థిని తోసిపుచ్చారట

గుజరాత్ ప్రభుత్వ చర్య దళితులను అవమానించడమేనని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర షెడ్యూల్ కుల వేదికైన నవసర్జన్ ట్రస్టు ప్రకటించింది. "ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ జెండాని తయారు చేయడంలో దాదాపు 100 దళిత వాలంటీర్లు పాల్గొన్నారు. అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పాలు పంచుకున్నారు. దాదాపు 25 రోజులు ఈ జెండా తయారుచేయడానికి శ్రమించారు. పూర్తిగా ఖాదీ బట్టను ఉపయోగించి ఈ జెండాను తయారుచేశాం. అంటరానితనాన్ని పాలద్రోలడం కోసం మేము చేపట్టిన ఈ కార్యంలో భాగంగా గాంధీనగర్ కలక్టరేటు అధికారులను కలిశాం. జెండాను కలక్టరేటులో ఆవిష్కరించేలా చేయమని విన్నవించుకున్నాం. అయితే కార్యాలయంలో ఖాళీ లేదని చెప్పి వారు మా వినతిని తోసిపుచ్చారు. వారి చర్య కచ్చితంగా దళితులను అవమానించడమే. తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుల్ గాంధీ తాను వచ్చినప్పుడు ఆ జెండాని స్వీకరిస్తామని తెలిపారు  " అని ట్రస్టు తెలిపింది. 

Trending News