పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి, శిక్షాకాలానికి సంబంధించిన అంతిమ తీర్పు కోసం వేచిచూస్తున్న ఖైదీగా రాంచీ జైలులో కాలం వెళ్లదీస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి చేతిలో ఓ చేదు అనుభవం ఎదురైంది. గురువారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఎదుట హాజరైన లాలూ ప్రసాద్ యాదవ్.. జైలులో తనకి బాగా చలిపెడుతోందని, అక్కడ తనని ఎవ్వరినీ కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని జడ్జికి ఫిర్యాదు చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఫిర్యాదుపై స్పందించిన జడ్జి.. ''అక్కడ మిమ్మల్ని ఎవ్వరినీ కలవనివ్వడం లేదు కనుకే ఇలా కోర్టుకి పిలిపించాం. ఇక్కడైతే మీరు నలుగురినీ కలిసేందుకు వీలుంటుంది'' అని ఛమత్కరించారు. అంతేకాదు.. ''ఒకవేళ మీకు అంత చలిగా అనిపిస్తే, జైల్లో హార్మోనియం, తబలా వాయించుకోండి'' అంటూ లాలూకి కౌంటర్ ఇచ్చారు. జడ్జి ఇచ్చిన ఈ సమాధానం విని నిర్ఘాంతపోవడం లాలూ వంతయ్యింది.
జడ్జికి లాలూ ప్రసాద్ యాదవ్‌కి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇంతటితో ఆగిపోలేదు. 'ఈ కుంభకోణంలో నా తప్పు ఏమీ లేదు' అని కోర్టుకి మొరపెట్టుకునే ప్రయత్నం చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మాటల్ని మధ్యలోనే అడ్డుకున్న జడ్జి గారు.. '' మీరు ముఖ్యమంత్రిగా, ఆర్ధిక శాఖ మంత్రిగా వుండి కూడా సరైన సమయంలో స్పందించలేదు సరికదా ఇప్పుడేమో నా తప్పేం లేదని అంటారా'' అని విసుక్కున్నారు.
జడ్జి మాటలపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్.. ''సర్ నేను కూడా ఒక న్యాయవాదినే'' అని అన్నారు. లాలూ ప్రసాద్ మాటలు విన్న జడ్జి గారు.. ''మీరు లాయర్ అయితే జైల్లో డిగ్రీ తీసుకోండి'' అని బదులిచ్చారు. జడ్జి అన్ని మాటలు అన్నప్పటికీ ఇంకా ఊరుకోని లాలూ ప్రసాద్ యాదవ్.. " సర్, ప్రశాంతంగా వుంటే పరిస్థితులు అవే చక్కబడతాయి" అని జడ్జిని కాకా పట్టించే ప్రయత్నం చేయబోయాడు.
లాలూ తనని కాకా పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన జడ్జి గారు.. "నేను ఎవ్వరి మాటలూ వినిపించుకోదల్చుకోలేదు. మీ కోసం మీ శ్రేయోభిలాషులు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు కానీ నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను" అని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. "ఒకవేళ మీకు(లాలూ ప్రసాద్ యాదవ్) కోర్టుకి రావడం అంత ఇబ్బందిగా వుంటే చెప్పండి, జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతాం'' అని జడ్జి స్పష్టంచేశారు. కానీ జడ్జి ఇచ్చిన ప్రతిపాదనపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం.. "అబ్బే.. అటువంటిదేమీ లేదు సర్. నేను కోర్టుకే వస్తాను" అని చెప్పి అక్కడి నుంచి బతుకుజీవుడా అన్నట్టుగా తప్పించుకోవాల్సి వచ్చింది.
కోర్టులో జడ్జికి, లాలూకి మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన సంభాషణ అదే సమయంలో అక్కడే వున్న ఓ న్యాయవాది ద్వారా బయటికి పొక్కింది.