రాహుల్..ప్రధానిగా మమతా, మాయావతిలను సమర్థిస్తారా?

బీజేపీ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ త్యాగానికి సిద్ధమైందనే వార్తలు జాతీయ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి

Last Updated : Jul 25, 2018, 11:43 AM IST
రాహుల్..ప్రధానిగా మమతా, మాయావతిలను సమర్థిస్తారా?

బీజేపీ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ త్యాగానికి సిద్ధమైందనే వార్తలు జాతీయ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీని అధికారంలో రాకుండా చేసేందుకు.. ప్రధాని పదవిని వదులుకునేందుకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల్లో ఎవరైనా 'ప్రధాని' పీఠంపై ఆసక్తితో ఉంటే వారికే ఇస్తామనే సంకేతాలు ఇస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్‌ నేపథ్యంలేని ఎవరికైనా ఈ ఛాన్స్ ఇస్తామని అంటోంది.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు గత కొంతకాలంగా రాహుల్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కాంగ్రెస్‌ నమ్మదగిన భాగస్వామి కాదని, మిత్రపక్షాలను నట్టేట ముంచిన చరిత్ర ఆ పార్టీకి ఉందంటూ ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో ఆరోపించారు. ప్రతిపక్షాల్లో చాలామంది కన్ను ప్రధాని పీఠంపై ఉందని.. నాయకత్వం విషయం తెరపైకి రాగానే ఆ కూటమి ముక్కలవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పదవిని త్యాగం చేసే యోచనలో కాంగ్రెస్‌ తెలుస్తోంది.

 

మాయావతి, మమతలపైనే..

తమతో జట్టు కట్టబోయే పార్టీల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సి వస్తే.. బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీల పేర్లే కాంగ్రెస్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరూ ఇప్పటివరకూ బహిరంగంగా ప్రధాని పదవిపై పెదవి విప్పకపోయినా.. అవకాశం వస్తే తిరస్కరించే అవకాశం ఉండదని భావిస్తున్నారు.

ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో  రానున్న లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే.. సాధ్యమైనన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలని.. పార్టీ గెలుపు కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని అధినేత రాహుల్‌కు కట్టబెట్టిందని తెలిసింది.

 

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా అడ్డుకునేందుకు తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌తో జతకట్టి ఆ పార్టీ నేత కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. అదే వ్యూహాన్ని జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలన్నది కాంగ్రెస్ యోచన.

Trending News