Congress Flop Show: ఉన్నదీ పోయిందీ.. అనుకున్నదీ చేజారింది.. అయోమాయంలో కాంగ్రెస్

130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇబ్బలేకపోయింది. అటు పంజాబ్ లోనే కాకూండా  మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటమిని చవి చూసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 06:24 PM IST
  • అయోమాయంలో కాంగ్రెస్ పార్టీ
  • 5 రాష్ట్రాల్లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్
  • గట్టి పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన కాంగ్రెస్
Congress Flop Show: ఉన్నదీ పోయిందీ.. అనుకున్నదీ చేజారింది.. అయోమాయంలో కాంగ్రెస్

Congress Flop Show: ఉన్నదీ పోయిందీ... అనుకున్నదీ చేజారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ అడ్రస్ ఐదురాష్ట్రాల ఎన్నికల్లో పూర్తిగా గల్లంతైంది. ఒక్క చోట కూడా గట్టిపోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.

పంజాబ్ లో ఆప్ చేతిలో ఓటమి 

కాంగ్రెస్ పార్టీని వరుస పరాభవాలు వెంటాడుతున్నాయి. గత రెండు లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటముల తర్వాత ఏం చేసినా ఆ పార్టీ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆపార్టీకి రిక్తహస్తమే మిగిలింది. అధికారంలో ఉన్న పంజాబ్ లో ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. ఏకంగా సీఎం చన్నీయే పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలయ్యాడు. ఇక పీసీసీ చీఫ్‌ సిద్ధూ తో పాటు మెజార్టీ మంత్రుల్ని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తీశాయి. స్టేట్ కాంగ్రెస్ ను కంట్రోల్ చేయడానికి పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు మొదటికే మోసం తెచ్చాయి. ప్రజల్లో కాస్తో కూస్తో పేరున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ను దూరంచేసుకోవడం.. ప్రజాదరణ లేని చన్నీని సీఎం చేయడం.. సిద్ధూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగిపోవడం.. పంజాబ్ లో ఆపార్టీని భూస్థాపితం చేశాయి.  రాహుల్, ప్రియాంక పరిపక్వత లేని నిర్ణయాలు తీవ్ర నష్టం చేకూర్చాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా.. సిద్ధూ చెప్పినట్లు తలూపడంతో ప్రజల నుంచి ఆ పార్టీ దూరమైంది.

ఉత్తరాఖండ్ లోనూ నిరాశే.. 

ఇక ఈ సారి అధికారం ఖాయమనుకున్న ఉత్తరాఖండ్ లోనూ కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ లో పోటా పోటీ ఉంటుందని అంచనాలొచ్చినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాహుల్ గాంధీ ఎంత ప్రచారం చేసినా గత ఎన్నికల్లో పోలిస్తే కొన్ని సీట్లు పెరిగాయే తప్ప అధికారం మాత్రం దక్కలేదు. ఏకంగా మాజీ సీఎం హరీష్‌ రావత్ ఓటమిపాలయ్యాడు. ప్రజల నుంచి సానుకూలత ఉన్నా కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. క్యాడర్ తో పాటు పైస్థాయి నేతలు కూడా గట్టిగా పోరాడకపోవడంతో మరోసారి రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. కనీసం ఈ ఒక్కరాష్ట్రాన్నైనా గెలుచుకుంటామనుకున్న ఆశలు అడియాసలయ్యాయి.

యూపీలో సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్ 

యూపీలో గెలుపుపై ఆశలు లేకపోయినా.. ఉనికిని చాటుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్ర ఓటర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. రాష్ట్ర ఇంఛార్జిగా ప్రియాంకా గాంధీకి బాధ్యతలు తీసుకొని కాలికి బలపం కట్టుకొని తిరిగినా ఫలితం దక్కలేదు. హిందూ ఓట్లకోసం గుళ్లు గోపురాలు తిరిగినా.. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినా... ప్రియాంకను జనం నమ్మలేదు. చివరకు సోనియాగాంధీ సొంత నియోజకవర్గం రాయ్ బరేలీ పరిధిలో కూడా ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది. యూపీలో సత్తా చాటడం ద్వారా తిరిగి జాతీయ స్థాయిలో పుంజుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీలో  ఈ ఫలితాలు తీవ్ర నిరాశను నింపాయి. అతిపెద్ద రాష్ట్రంలో అతి పురాతన పార్టీకి లభించిన ఈ దారుణ ఫలితాలు ఆ పార్టీ భవిష్యత్తును అంధకారంలో పడేశాయి.

గోవా, మణిపూర్ లో ఏకపక్షం

ఇక గోవా, మణిపూర్ పైనా ఆ పార్టీకి ఉన్న ఆశల్ని ఓటర్లు గంగలో కలిపేశారు. గోవాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా జనం కాంగ్రెస్ వైపు మాత్రం మళ్లలేదు. ఆ పార్టీ జనంలో భరోసా కల్పించలేకపోయింది. హోరాహోరీ తప్పదనుకున్న పోరు ఏకపక్షమైంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. మణిపూర్ లోనూ అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మొత్తంగా ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయస్థాయిలో ఆ పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. బీజేపీకి కాంగ్రెస్ ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్న నిష్టూర నిజాన్ని ఎన్నికలు అందరికీ తెలిసేలాచేశాయి. ఫైవ్ స్టేట్ ఎలక్షన్స్ లో సత్తా చాటి వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి తన నేతృత్వంలో బలమైన కూటమి నిర్మిద్దామనుకున్న ఆ పార్టీకి ఇక ఆ ఆశ లేకుండా పోయింది.

Also Read: Radhe Shyam: తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ!!

Also Read: DA hike: ఉద్యోగులకు హోలీ గిఫ్ట్​- డీఏ పెంపుపై త్వరలో ప్రభుత్వ ప్రకటన?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News