బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి పశుదాణా కుంభకోణం కేసులో 3.5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో లాలూకి శిక్షా కాలాన్ని ఖరారు చేస్తూ జడ్జి తీర్పుని చెప్పారు. పశుదాణా కుంభకోణం కేసులో లాలూని రెండు వారాల క్రితమే దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి విధించాల్సి వున్న శిక్షాకాలాన్ని మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది.
గురువారమే వెల్లడి కావాల్సి వున్న ఈ తీర్పు పలు కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. అయితే, గురువారం, శుక్రవారం కోర్టుకి హాజరైన లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం మాత్రం జైలు నుంచే కోర్టు విచారణలో పాల్గొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముందా జైలులో వున్నారు.
ఇదే పశుదాణా కుంభకోణం కేసులో 2013లో సెప్టెంబర్ 30న తొలిసారి లాలూని దోషిగా తేల్చిన కోర్టు.. అదే ఏడాది అక్టోబర్ 3న అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు నెలలపాటు జైలులో వున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. అయితే, ఈ కేసులో జైలుకి వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి రావడంతోపాటు అప్పటి నుంచే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఈ కుంభకోణం కేసులో మొత్తం 34 మంది ఆరోపణలు ఎదుర్కోగా అందులో 11 మంది కేసు విచారణ దశలో వున్నప్పుడే మృతిచెందారు. ఆరోపణలు ఎదుర్కున్న వారిలో ఒకరు సీబీఐ ఎదుట తన నేరాన్ని అంగీకరించగా శిక్ష పడిన 16 మందిలో పూల్ చంద్ మండల్, బెక్ జూలియస్, మహేష్ ప్రసాద్ అనే ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా వున్నారు.
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు విచారణ ఎదుర్కున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా విడిచిపెట్టింది.