7th pay Commission News: 7వ పే కమిషన్ అమలు చేయకపోతే మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు, విభాగాలకు చెందిన ఉద్యోగులం నిరవధిక ధర్నాకు దిగుతామని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొంటారని ఉద్యోగ సంఘాల నేత సి.ఎస్. శాదాక్షరి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. కర్ణాటక సర్కారు ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమ జీతభత్యాల పెంపుని దృష్టిలో పెట్టుకుని 7వ పే కమిషన్ అమలు చేస్తారని ఉద్యోగ సంఘాలు ఆశపడ్డాయి. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటక బడ్జెట్ 2023 లో 7వ పే కమిషన్, జీతాల పెంపు ప్రస్తావనే లేదు. దీంతో అప్పటి నుంచే ఉద్యోగ సంఘాలు కర్ణాటక సర్కారుపై మండిపడుతూ వస్తున్నాయి.
ఈనేపథ్యంలో మార్చి 1 లోగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇక తాము నిరవధిక ధర్నాలో కూర్చోవడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు చేస్తోన్న డిమాండ్స్ ఏంటంటే..
రాష్ట్రంలో 7వ పే కమిషన్ అమలు చేయాలి.
రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.
ఇదే విషయమై శివమొగ్గలో ఉద్యోగ సంఘాల నేత సి.ఎస్. శాదాక్షరి మీడియా మాట్లాడుతూ, బసవరాజ్ బొమ్మై ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని.. ముఖ్యమంత్రి వైఖరి 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడమే అవుతుంది అని అన్నారు. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ సహా అన్ని విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొంటారు అని అన్నారు. 7వ పే కమిషన్ సిఫార్సులు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని.. అప్పటి వరకు నివరధిక ధర్నా కొనసాగుతుంది అని శాదాక్షరి స్పష్టంచేశారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు కూడా మరో మూడు రోజులే ఉన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది అనేదే ప్రస్తుతానికి ఆసక్తిగామారింది. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ఉద్యోగులు ఏం జరుగుతుందా అని నిశితంగా పరిశీలిస్తున్నారు.