కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్... అస్వస్థతతో ఆస్పత్రిపాలైన సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురై బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

Last Updated : Jul 21, 2019, 11:17 PM IST
కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్... అస్వస్థతతో ఆస్పత్రిపాలైన సీఎం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురవడంతో ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. తెల్లవారితే సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన ఇలా ఆసుపత్రి పాలవడం చర్చనియాంశమైంది. ఇప్పటికే రెండుసార్లు బలపరీక్షను వాయిదా వేసిన కుమారస్వామి ఇప్పుడిలా మూడోసారి బల పరీక్షకు కొన్ని గంటల ముందు అస్వస్థతకు గురవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపి ఆరోపిస్తోంది. కుమారస్వామి బలపరీక్ష నుంచి తప్పించుకోవడానికే మరో కొత్త డ్రామాకు తెరలేపారని, సాధ్యమైనంత వరకూ బలపరీక్షను పొడిగించి, సభ్యుల మద్దతు కూడగట్టుకున్న తర్వాతే బల పరీక్ష నిర్వహించాలని చూస్తున్నారని బీజేపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రేపే కుమారస్వామి సర్కార్‌కి ఆఖరి రోజు అవుతుందని ఇప్పటికే బీజేపి అగ్రనేత, మాజీ సీఎం బిస్ యడ్యూరప్ప అన్నారు.

కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు మాత్రం అది సాధ్యపడేలా లేదని చెప్పకనే చెబుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షలో తాను పాల్గొనడం లేదని ఇప్పటికే బీఎస్‌పీ ఎమ్మెల్యే ప్రకటించగా.. మరోవైపు రాజీనామాను ఉపసంహరించుకునే ఛాన్సే లేదని ముంబైలోని హోటల్లో బసచేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. దీంతో కుమారస్వామి సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లయిందని పరిశీలకులు చెబుతున్నారు.

Trending News