న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి, వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.9000 కోట్లకుపైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను తమ దేశానికి అప్పగించాల్సిందిగా భారత్ లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది కాలంగా వెస్ట్ మినిష్టర్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా రేపు సోమవారం ఈ కేసులో లండన్ కోర్టు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో భారత్ నుంచి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఓ సాయి మనోహర్ నేతృత్వంలోని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంయుక్త బృందం లండన్‌కి బయల్దేరింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా వున్న ఏ సాయి మనోహర్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
1995 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్‌కి చెందిన ఏ సాయి మనోహర్ ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల సీబీఐలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో సీబీఐలో మొత్తం 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. అలా బదిలీ అయిన ఆ 13 మంది అధికారుల్లో తెలుగు నేపథ్యం కలిగిన సాయి మనోహర్ కూడా ఒకరు.