గోవా సీఎంగా ఆయనకే పగ్గాలు..?

గోవా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో అనేక నెలలుగా బాధపడడంతో.. ఇప్పటికే ప్రభుత్వంలో అస్థిరత నెలకొంటోంది.

Last Updated : Oct 17, 2018, 09:03 PM IST
గోవా సీఎంగా ఆయనకే పగ్గాలు..?

గోవా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో అనేక నెలలుగా బాధపడడంతో.. ఇప్పటికే ప్రభుత్వంలో అస్థిరత నెలకొంటోంది. పైగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీని కాదని.. ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ నేతలు కూడా వీలు దొరికినప్పుడల్లా రాష్ట్రపతి పాలన స్లోగన్ అందుకుంటూ కొత్త రాజకీయాలకు తెరలేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే అధికారంలో ఉన్న పార్టీకి సంఖ్యాబలం తగ్గడంతో కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ కోరారు.

కానీ అంతలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కథ అడ్డం తిరిగిపోయింది. చేతి వరకూ వచ్చిన అదృష్టం చేజారిపోయిందని కాంగ్రెస్ బాధపడడం తప్ప.. వారికి వేరే గత్యంతరం కనిపించలేదు. 16 స్థానాల్లో కాంగ్రెస్  గెలిచినా కూడా.. 14 స్థానాలు గెలిచిన బీజేపీ నేతలు, ఇతర మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు రావడంతో సీన్ రివర్స్ అయిపోయింది. తాజాగా మళ్లీ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో.. కాంగ్రెస్ సంఖ్య 14కి పడిపోయింది. ఈ  క్రమంలో కాంగ్రెస్ నుండి ఉద్వాసనలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే గోవా ముఖ్యమంత్రి కూడా మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వజిత్ రాణె గోవాకి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతారని.. అందుకు రంగం సిద్ధమవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎయిమ్స్‌లో వైద్యులు పర్యవేక్షణలో ట్రీట్ మెంట్  తీసుకుంటున్న పారికర్.. ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. అయినా.. ఇంటికి పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం బాధ్యతలను ఇంకెవరికైనా అందివ్వాలని.. పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం రాణె గోవా ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.

Trending News