Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ వర్సెస్ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నెలకొన్నా ప్రధాన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. మరోవైపు ఉనికి చాటుకునేందుకు ఎంఐఎం సిద్ధమైంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉనికి చాటుకున్న హైదరాబాద్ పార్టీ ఎంఐఎం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా సిద్ధమైంది. ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న రెండు నియోజకవర్గాల్ని టార్గెట్ చేసింది. ఢిల్లీ వీధుల్లో గాలిపటం ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని ఓఖ్లా, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్ధుల్ని రంగంలో దింపింది. విశేషమేమంటే ఈ ఇద్దరు అభ్యర్ధులు ప్రస్తుతం జైళ్లో ఉన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరూ జైళ్లో ఉంటే..ఒవైసీ స్వయంగా రంగంలో దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓఖ్లా నుంచి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ రంగంలో ఉంటే ముస్తఫాబాద్ నుంచి షిఫా ఉర్ రెహమన్ బరిలో నిలిచారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, హింస కేసుల్లో జైళ్లో ఉన్నారు.
ఓట్లు చీల్చేందుకా, గెలిచేందుకా
ఓఖ్లా నియోజకవర్గంలో మొత్తం 3.35 లక్షలమంది ఓటర్లు ఉండగా అందులో 1.7 లక్షలమంది అంటే 52.5 శాతం మంది ముస్లింలే. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలో కూడా 2.63 లక్షలమంది ఓటర్లు ఉండగా 1.03 లక్షమంది అంటే 40 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ గణాంకాల్ని పరిగణలో తీసుకునే ఎంఐఎం పోటీకు దిగింది. ఓఖ్లాలో 2015, 2020 ఎన్నికల్లో వరుసగా అప్ నేత అమానుల్లా ఖాన్ 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసుల్ని ఎదుర్కొని కూడా బయటికొచ్చి పోటీలో ఉన్నారు. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 2015లో బీజేపీ, 2020ల ఆప్ విజయం సాధించాయి. ఆప్ నేత హాజీ హుస్సేన్ మరోసారి బరిలో ఉన్నారు. ఈ ఇద్దర్నీ తట్టుకుని మజ్లిస్ విజయకేతనం ఎగురవేయడం అనుమానమే. కానీ అదే సమయంలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఉండటంతో ఎంఐఎం ఎన్ని ముస్లిం ఓట్లు చీల్చగలిగితే బీజేపీకు అంత అవకాశముంటుంది. అందుకే ఎంఐఎంపై ఆప్ ఆరోపణలు చేస్తోంది. బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం రంగంలో దిగిందనే ప్రచారం చేస్తోంది.
వాస్తవ పరిస్థితి కూడా అదే కన్పిస్తోంది. సీఏఏ ఘర్షణల్లో జైలులో ఉన్న మజ్లిస్ నేతలిద్దరికీ కాస్తో కూస్తూ సానుభూతి ఉంది. ఒవైసీ తనదైన శైలిలో ప్రచారంతో ముస్లిం ఓట్లనే టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు మజ్లిస్ పార్టీలు చీలిస్తే బీజేపీకు విజయం కష్టమేం కాదు. ఇదే కాలిక్యులేషన్ కన్పిస్తోంది ఇప్పుడు. గాలిపటం ఎగురవేస్తున్నది ఇతరుల పతంగుల్ని చింపేందుకేననే విమర్శలు నిజమన్పిస్తున్నాయి.
Also read: GBS Virus Threat: ఇండియాలో మరో కొత్త వైరస్, ప్రమాదకరమంటున్న వైద్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి