మహిళల హింసకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే పురుషులూ ఉన్నారు: బీజేపీ నేత

బీజేపీ నేత హరినారాయణ్ రాజ్బర్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మహిళా కమీషన్ మాదిరిగానే జాతీయ పురుషుల కమీషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

Last Updated : Sep 3, 2018, 06:05 PM IST
మహిళల హింసకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే పురుషులూ ఉన్నారు: బీజేపీ నేత

బీజేపీ నేత హరినారాయణ్ రాజ్బర్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మహిళా కమీషన్ మాదిరిగానే జాతీయ పురుషుల కమీషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పురుషుల చేతిలో హింసకు గురవుతున్న మహిళలు ఉన్నట్లే.. మహిళల చేతిలో హింసకు గురవుతున్న పురుషులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఏఎన్ఐ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ "లింగ భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం జరగాలన్నదే నా అభిమతం. పలు కేసులలో మహిళలు పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పురుషులు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కదా" అని రాజ్బర్ ప్రశ్నించారు.

"నేను గత నెల పార్లమెంటులో ఇదే విషయాన్ని లేవనెత్తినప్పుడు.. నా ఫోన్‌కి దాదాపు 5000 సందేశాలు వచ్చాయి. అనేకమంది పురుషులు నా ప్రతిపాదనను సమర్ధించారు కూడా. ఏదేమైనా సమాజంలో కొన్ని మార్పులు జరగాలి. తప్పు ఎవరు చేసినా క్షమించకూడదు. ఇందులో మహిళలు, పురుషులు అన్న ప్రస్తావనే ఉండకూడదు " అని రాజ్బర్ అన్నారు. 

ఇప్పటికే జాతీయ పురుషుల కమీషన్ ఏర్పాటు కోసం ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి కూడా లేఖ రాశానని రాజ్బర్ తెలిపారు. రాజ్బర్ వ్యాఖ్యల పై జాతీయ మహిళా కమీషన్ రేఖా శర్మ మాట్లాడుతూ, తన దృష్టిలో ఇలాంటి కమీషన్ ఏర్పాటు అనేది అనవసరమని భావిస్తున్నానని... అయితే పురుషులు తమకు కమీషన్ కావాలని డిమాండ్ చేయడంలో తప్పు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా రాజ్బర్ ఈ కమీషన్ గురించి మాట్లాడుతూ, దేశ రాజధానిలో సెప్టెంబరు 23వ తేదిన "పురుష్ ఆయోగ్" ప్రారంభిస్తున్నామని.. పురుషుల హక్కుల కోసం కమీషన్ ఏర్పాటు చేయాలా వద్దా? అన్న అంశంపై ఆ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

 

Trending News