వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగనున్న మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో మోదీ-అమిత్ షా సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ (భాజపా) ఓడిపోతుందని తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటనుందని సర్వేలు తెలిపాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఓటమి తప్పదని పేర్కొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక కాలం పాటు పాలించిన బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.
అటు 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్ సీఎం అవుతారని సర్వే తెలిపింది. రాజస్ధాన్‌లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో ఉండటంతో అక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది.
సీనియర్ బిజెపి నాయకుడు, న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..బీజేపీ పార్టీకి కష్టపడేతత్వం ఉందని.. ఆ రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధి చర్యలే బీజేపీని ఘనవిజయం తెచ్చిపెడతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 142 స్ధానాలు, బీజేపీ 56 స్ధానాలు దక్కుతాయని సర్వే పేర్కొంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు122 స్ధానాలు.. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 స్ధానాలు లభిస్తాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉన్నా.. అక్కడ మాత్రం బీజేపీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లనే తదుపరి సీఎంలుగా ఎక్కువ మంది కోరుకుంటున్నారని తెలిపింది.
ఇటీవలే భారత ఎన్నికల సంఘం చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని.. డిసెంబర్ 11న ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.