న్యూఢిల్లీ: ఆటో కన్నా.. విమాన ధరలే కారుచౌక అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా సోమవారం వ్యాఖ్యానించారు. 'ప్రస్తుతం ఆటో చార్జీలతో పోలిస్తే విమాన చార్జీలు తక్కువగా ఉన్నాయి' అని జయంత్ వ్యాఖ్యానించారు. 'ఇదెలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. ఉదాహరణకి ఓ ఇద్దరు ప్రయాణీకులు ఆటోలో వెళ్తే పది రూపాయలు చెల్లించాలి. అంటే కిలోమీటర్ కి ఐదు రూపాయలన్నమాట. అదే మీరు విమానాల్లో ప్రయాణిస్తే కిలోమీటర్ కి రూ.4లే ఛార్జ్ అవుతుంది.'అని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లెక్కేశారు. ఈ కారణం వల్ల కూడా ఇండియన్ ఎయిర్ లైన్స్ కంపెనీలు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయని జయంత్ సిన్హా అన్నారు.
అటు అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి క్షీణిస్తుండటం దేశీ విమానయాన సంస్థలను కుంగదీస్తోంది. పెరిగిన వ్యయాలను ప్యాసింజర్లకు బదలాయించే పరిస్థితులు లేనందున ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ వంటి విమానయాన సంస్థలు గత కొన్నాళ్లుగా నష్టాలు, తక్కువ స్థాయిలో లాభాలే నమోదు చేస్తున్నాయి.
కాగా, సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత విమానయాన సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 బిలియన్ డాలర్ల వరకు నష్టాలను నమోదు చేయనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం 430–460 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాదిలో భారత్ సహా అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్ లాభాలు భారీగా తగ్గొచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) అంచనా వేస్తోంది.