ఆశారాంకు జీవిత ఖైదు విధించిన జోధ్‌పూర్‌ కోర్టు

అత్యాచారం  కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ ట్రైబ్ కోర్టు తీర్పు చెప్పింది.

Last Updated : Apr 25, 2018, 06:39 PM IST
ఆశారాంకు జీవిత ఖైదు విధించిన జోధ్‌పూర్‌ కోర్టు

రాజస్థాన్‌: అత్యాచారం  కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ ట్రైబ్ కోర్టు తీర్పు చెప్పింది. బాలికపై అత్యాచారం కేసులో తుది విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ ఉదయం రేప్ కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్థారించిన సంగతి తెలిసిందే. ఇక శిక్ష ఖరారుపై వాదోపవాదాలను విన్న అనంతరం కొద్ది ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

 

 

16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆశారాంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్థారించి, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ మధుసూదన్‌ శర్మ తీర్పును వెల్లడించారు. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

కాగా కోర్టు తీర్పు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నాలుగు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు పాల్పడతారేమోననే అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు.

కాగా ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడిందని వార్త విన్న బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో తమకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు.

2013 సంవత్సరం నుంచి జైలు జీవితం గడుపుతున్న స్వయం ప్రకటిత గురువు ఆశారాంపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాటి నుంచి ఇప్పటి వరకు బాధితురాలి కుటుంబానికి హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి పర్యవేక్షిస్తున్నామని సహరాన్‌పూర్ ఎస్పీ కేబీ సింగ్ తెలిపారు. కాగా, ఈ కేసు తీర్పు కవరేజీకి మీడియాను అనుమతించాలన్న పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు కొట్టేసింది.

Trending News