డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమంలో ఆయనను చూడడానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెన్నై వచ్చారు. ఆయనను కరుణానిధి కుమారుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌తో పాటు కనిమొళి మొదలైనవారు కలిశారు. ఈ సందర్భంగా గడ్కరి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కరుణానిధి ట్రీట్ మెంట్ పొందుతున్న ఆసుపత్రి బయట భారీ జన సందోహం కనిపిస్తోంది. వారిలో చాలామంది కలైంగర్ ఆరోగ్యం కోసం సామూహికంగా ప్రార్థనలు చేయడం కూడా మొదలుపెట్టారు.
జనాలను పోలీసులు కంట్రోల్ చేస్తూ.. ప్రస్తుతం సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా ఆసుపత్రి బయట కట్టుదిట్టంగా చేస్తున్నారు. డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, టీకేఎస్ ఎలంగోవన్‌తో పాటు డీఎంకే నేతలు దురైమురుగన్, ఏ రాజా, కె పొన్ముడి, ఐ. పెరియస్వామి మొదలైనవారు ఇప్పటికే ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. సాయంత్రమే కావేరి ఆసుపత్రి యాజమాన్యం కరుణానిధి ఆరోగ్యం గురించి ప్రకటన విడుదల చేస్తూ.. మరో 24 గంటలు వేచి చూడాలని తెలిపిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చెన్నైలో ఎల్డామ్స్ రోడ్డు జంక్షన్ నుండి ఆళ్వార్ పేట వరకు భారీగా డీఎంకే కార్యకర్తలు స్లోగన్స్ చేస్తూ రావడం జరిగింది. కరుణానిధి ఫోటోలతో వారు ర్యాలీలు కూడా చేశారు. ఈ క్రమంలో చెన్నై పోలీస్ వర్గాలు ఎక్కడిక్కడ అదనపు బలగాలను మోహరించారు. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తకూడదని పోలీసులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగానే బలగాలు కాపలా కాస్తున్నాయి. ఈ రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో కరుణానిధి కుమారుడు స్టాలిన్ పలువురు నాయకులతో కలిసి ఆసుపత్రి నుండి వెళ్లారు.
డీఎంకే నేత స్టాలిన్‌ను కలిసిన కేంద్రమంత్రి గడ్కరి: కరుణానిధి ఉన్న ఆసుపత్రి బయట భారీ జనసందోహం