ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. కేజ్రీవాల్ ఎప్పుడూ ఉపయోగించే బ్లూకలర్ వేగనార్ ఢిల్లీ సెక్రటేరియట్ నుండి ఉన్నట్టుండి మాయమైంది. ఈ విషయమై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ప్రస్తుతం చోరీకి గురైన ఆ వాహనాన్ని గాలిస్తున్నారు. గతంలో కేజ్రీవాల్ తన పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఇదే వాహనాన్ని విరివిగా ఉపయోగించేవారు. పలువురు ఈ కారుకు ఆప్ మొబైల్ అని కూడా పేరు పెట్టారు. 2014లో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ నడిరోడ్డు మీద కేజ్రీవాల్ ధర్నా చేయడానికి వెళ్లేటప్పుడు కూడా ఈ కారులోనే వెళ్లారు. ఈ కారును పార్కు చేసే తన ధర్నాను ప్రారంభించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కొద్దిరోజులు ఇదే కారును వినియోగించారు. ఒక ఎన్నారై ఈ కారును కేజ్రీవాల్‌కు గిఫ్టుగా ఇచ్చారు. ఈ కారు కేసు విషయమై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించినట్లు ఢిల్లీ డిప్యూటీ కమీషనరు ఆఫ్ పోలీస్ మందీప్ రాండ్వా తెలిపారు.