చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు నగరాల్లో హల్చల్ చేస్తున్నాయని వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తూ.. జనాలను భయాందోళనలకు గురిచేస్తున్న వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాల పోలీసులనూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి పుకార్లు జనాల్లో సర్క్యులేట్ కాకుండా చూడాల్సిన బాధ్యతను సైబర్ క్రైం పోలీసులు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ముఖ్యంగా ఇలాంటి నకిలీ సందేశాల పట్ల జాగరూపులై ఉండాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని... పత్రికా ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే పిల్లల కిడ్నాప్ కేసులు నమోదైనప్పుడు.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తును వేగవంతం చేసి.. కేసులను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ విధంగా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని తెలిపింది.
ఇప్పటికే కేంద్రం వాట్సాప్ యాజమాన్యం దృష్టికి ఈ సమస్యను తీసుకొనివెళ్లింది. వాట్సాప్‌ను ఆధారంగా చేసుకొని పలువురు నేరాలు చేస్తున్న క్రమంలో.. వాటికి అడ్డుకట్ట వేసే విషయంలో తమకు సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వం, వాట్సాప్ యాజమాన్యాన్ని కోరింది. మంగళవారం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై స్పందించింది.
వాట్సాప్‌ను అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించేవారందరూ శిక్షార్హులని తెలిపింది. గత వారం, మహారాష్ట్రలోని దూలే ప్రాంతానికి ఉపాధి కోసం వచ్చిన యువకులను... పిల్లలను ఎత్తుకెళ్లేవారిగా భావించి గ్రామస్థులు దేహశుద్ధి చేయగా.. వారిలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు కారణం కూడా నకిలీ వాట్సాప్ మెసేజ్లేనని తర్వాత తేలింది.