కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ దిగ్గజ నాయకులు ప్రచారాలు నిర్వహించగా, కాంగ్రెస్ తరఫున ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఒక్కరే ప్రచారం సాగించారు. అయితే ఇప్పుడు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. బీజాపూర్‌లో మే 8న ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సోనియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి.
రెండేళ్ల తరువాత మొదటిసారి సోనియాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆమె రాకతో విజయావకాశాలు మరింత మెరుగవుతాయని ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదు.
కాగా.. కర్ణాటకలో మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మే 15న ఫలితాలను ప్రకటిస్తారు. 224 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 28తో ముగుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ జేడీఎస్ కూడా పోటీ ఇవ్వనుంది.
రెండేళ్ల తరువాత తొలిసారి రంగంలోకి సోనియా గాంధీ