మహిళలపై సామాజిక ఒత్తిడి తీవ్రమైన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు మైనార్టీ దాటిన అమ్మాయిలు ఎవరితో ఉండాలనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా, జస్టిస్ ఎఎన్ ఖాన్విల్కర్, డి.వై.చంద్రచుడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
తన 20 ఏళ్ల కూతురిని ఆమె తండ్రివద్ద నుంచి వేరు చేసి.. తనకు అప్పగించాల్సిందిగా ఓ మహిళ వేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు- "మైనార్టీ దాటిన అమ్మాయిలు ఎవరితో ఉండాలనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది" అని వ్యాఖ్యలు చేసింది. విడాకులు పొందిన వారి పిల్లలు తాము తండ్రి వద్ద ఉండాలో లేదా తల్లి వద్ద ఉండాలో నిర్ణయించుకొనే హక్కు వారికే ఉంటుంది అని పేర్కొంది. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం అని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఓ 20 ఏళ్ల అమ్మాయి.. అదే సమయంలో కువైట్‌లోని హువాయ్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ వచ్చినప్పడు ఆ దేశానికి వెళ్లడానికి నిశ్చయించుకుంది. అయితే ఆ దేశంలో తన చదువును కొనసాగించడానికి అక్కడే ఉన్న తన తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె కోర్టును కోరింది. బెంచ్ ఆ అమ్మాయి తన తండ్రితో కలిసి ఉండటానికి అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ తండ్రి తన 13 ఏళ్ళ కుమారుడిని కేరళలోని తల్లి వద్దకు వేసవి సెలవులకుగాను పంపించమని ఆదేశించింది.