ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవడానికి ఆధార్ కేంద్రాలకి వెళ్లే వాళ్ల జేబులకి మరింత చిల్లు పడనుంది. ప్రస్తుతం రూ.25 తీసుకుని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు మార్చడం అమలులో వుంది. అదేవిధంగా మరో రూ.25 తీసుకుని బయోమెట్రిక్స్ (వేలి ముద్రలు) అప్‌డేట్ చేయడం జరుగుతోంది. అయితే, ఇకపై ఈ వివరాలు మార్చుకోవాలని భావించే వాళ్లు ఈ మొత్తం బిల్లుపై 18శాతం జీఎస్టీ చార్జీలు కూడా చెల్లించాల్సి వుంటుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుతం మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
To update details in your Aadhaar, you need to present the supporting documents (not applicable for mobile number, email or biometric updates). See the list of acceptable documents here - https://t.co/BeqUA0pkqL pic.twitter.com/dfbUbNYw43
— Aadhaar (@UIDAI) February 4, 2018
మీడియా కథనాల ప్రకారం ఆధార్ సర్వీసులని సైతం ఇకపై వస్తు, సేవల పన్ను పరిధిలోకి తీసుకురావాలని ఆధార్ నిర్వాహకులైన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) నిర్ణయించినట్టు సమాచారం. అయితే, తాజాగా ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవాలనుకున్న వాళ్లు అందుకు సంబంధించిన పత్రాలు కూడా జతపర్చాల్సి వుంటుంది అని ఓ ట్వీట్ చేసిన యుఐడీఏఐ.. ఆ ట్వీట్‌లో ఈ జీఎస్టీ ఛార్జీల గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.
ఇక ఇదిలావుంటే, చిన్నపిల్లల ఆధార్ నమోదు, వారి బయోమెట్రిక్ నమోదు పూర్తి ఉచితం అని ఆధార్ నిబంధనలు స్పష్టంచేస్తున్న సంగతి తెలిసిందే. ఆధార్ అప్‌డేట్ కోసం పైన పేర్కొన్న చార్జిలకన్నా ఎక్కువ డిమాండ్ చేసినా, లేదా చిన్నపిల్లల ఆధార్ నమోదు కోసం చార్జీలు వసూలు చేసినా, సదరు ఆధాక్ కేంద్రంపై 1947 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా help@uidai.gov.in కి ఈమెయిల్ కూడా చేయవచ్చు.