బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కు ( Bollywood Badshah Amitabh ) ట్విట్టర్ సాక్షిగా అగౌరవం ఎదురైంది. ఆయనపై ఉన్న గౌరవం కాస్తా పోయిందంటూ ఓ మహిళ ట్విట్టర్ సాక్షిగా చెప్పడం సంచలనమైంది. అమితాబ్ మాత్రం దీనికి సానుకూలంగా సమాధానమివ్వడం విశేషం.
కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ నానావతి ఆసుపత్రి ( Nanavathi Hospital ) లో చికిత్స పొందారు. ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడి వైద్యులు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపిస్తూ...అమితాబ్ పలు ట్వీట్లు ( Amitabh tweets on Nanavathi hospital ) చేశారు. ఇప్పడీ ట్వీట్లే ఓ మహిళకు ఆగ్రహాన్ని తెచ్చాయి. కారణం ఆ ఆసుపత్రి చేతిలో ఆమె బాధితురాలు కావడమే.
జాన్వీ మఖీజా అనే ఓ మహిళ తన తండ్రిని చికిత్స నిమిత్తం నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడి డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ లతో అడ్మిట్ చేయించారు. కొద్దిరోజుల తరువాత కుటుంబసభ్యులు యాంటీ బాడీస్ టెస్ట్ చేయించగా..అసలాయనకు కరోనా సోకలేదని తెలిసింది. దాంతో ఆమెకు అగ్రహం కలిగింది. కేవలం డబ్బుల కోసమే నానావతి ఆసుపత్రి వైద్యులు డ్రామాలాడారని...అటువంటి ఆసుపత్రి గురించి, వైద్యుల గురించి కీర్తించడంతో అమితాబ్ పై ఆమె ఆగ్రహం చెందింది. ఇటువంటి ఆసుపత్రికి మీరు పబ్లిసిటీ ఇస్తుండటంతో నాకు బాధ కలిగింది. నేటి నుంచి మీ పై ఉన్న గౌరవం పోయింది అంటూ ఆ మహిళ ట్వీట్ చేసింది.
అయితే దీనికి బిగ్ బి అమితాబ్ ( Big B Amitabh ) మాత్రం సానుకూలంగా స్పందించారు. నేను ఎవరికీ పబ్లిసిటీ చేయలేదు, నానావతి నుంచి నాకు లభించిన రక్షణ, చికిత్సకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. మీరు నా పట్ల గౌరవం కోల్పోయి ఉండవచ్చు, కానీ వైద్యుల పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది, మీ తండ్రికి జరిగిన దానికి నేను చింతిస్తున్నాను అంటూ ఆ మహిళకు రీట్వీట్ ( Retweet of Amitabh ) చేశారు అమితాబ్.