జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. 'ఘటన స్థలి నుంచి మృతదేహాలను వెలికితీశాం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం' అని డిప్యూటీ ఐజీ పీటీఐ వార్తా సంస్థకి తెలిపారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు, ఆర్మీ, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఆయన వివరించారు.
మరోవైపు, జమ్మూకాశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఆర్మీకి చెందిన ఒక వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది జవాన్లకు గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్లోని కణిపొరాలో ఆర్మీ వాహనం బోల్తా పడిందని, 13 మంది జవాన్లు గాయపడ్డారని వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.